
హాజరైన భక్తులు
తిరువళ్లూరు: పట్టణంలోని మారుతీ న్యూటౌన్‌లో కొత్తగా నిర్మించిన శ్రీ సెల్వగణపతి ఆలయంలో జీర్ణోద్ధరణ అష్టబంధన మహాకుంభాభిషేకం గురువారం ఉదయం వైభవంగా నిర్వహించారు. స్థానిక మారుతీ న్యూటౌన్‌లో సెల్వగణపతి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో కుంభాభిషేకం నిర్వహించాలని నిర్ణయించి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు విఘ్నేశ్వరపూజ, వాస్తుశాంతి, అష్టదీప కల్పపూజలతో ఉత్సవాలను ప్రారంభించారు. రెండవ రోజు మంగళవారం ఉదయం 7 గంటలకు గోపూజ, మహాగణపతి హోమం, నవగ్రహ హోమం, మొదటి కాలయాగ పూజలు, చతర్వేద పారాయణం, మహాదీపారాధన సాయంత్రం 4.30 గంటలకు రెండవకాల పూజ, మూలమంత్రహోమం, మహాదీపారాధన నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 7గంటలకు మూడవ కాలపూజ, దీపాఽరాధన సాయంత్రం 4 గంటలకు కొత్త విమాన కలశం ప్రతిష్ట, నాల్గవ కాలపూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం 5 గంటలకు 5వ కాలయాగ పూజలు, 6 గంటలకు మహాపూర్ణహుతి, యాత్రానం, కలశం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఉదయం గోపురంపై పుణ్యజలాలను వదిలి ప్రత్యేక పూజలు, కుంభాభిషేకం నిర్వహించారు. పూజలకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలను అందజేశారు. ఆలయ నిర్వాహకులు మురుగన్ స్థబతి, పద్మనాభశర్మ, సుందరశర్మ పాల్గొన్నారు.

కుంభాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు