
పేలుడులో నేలమట్టమైన గోడౌన్
సాక్షి, చైన్నె: బాణసంచా తయారీ గోడౌన్లో గురువారం సాయంత్రం పేలుడు సంభవించి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సేలం జిల్లా ఇరుంబాలై సమీపంలోని సర్కారు కొల్లపట్టి గ్రామంలో నాటు టపాసుల తయారీ ప్రభుత్వ అనుమతితో జరుగుతోంది. గురువారం ఉదయం తన గోడౌన్లో సతీష్ అనే బాణసంచా వ్యాపారి కార్మికులతో కలిసి తయారీలో నిమగ్నమయ్యారు. పది మంది కార్మికులు ఇక్కడ విధుల్లో ఉన్నారు. ఓ వేడుకకు బాణసంచా సరఫరా చేయాల్సి ఉండడంతో నాటు టపాసుల తయారీపై దృష్టిపెట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో హఠాత్తుగా ఆ గోడౌన్లో పేలుడు జరిగింది. అక్కడున్న బాణసంచా పేలడంతో గోడౌన్ నామ రూపాలు లేకుండా కాలిబూడిదైంది. ఈ శబ్దం ఉన్న పరిసర వాసులు అక్కడికి పరుగులు తీసినా, సహాయక చర్యలు చేపట్ట లేని పరిస్థితి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గోడౌన్ నిర్వాహకుడు సతీష్, నటేషన్, మరో మహిళ సంఘటన స్థలంలోనే తీవ్రగాయాలపై దుర్మరణం చెందారు. మహేశ్వరి, మేఘలై, బృందం, మోహన, వనితతోపాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో సేలం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి వెళ్లి సంఘటన స్థలంలో స్థానికులతో విచారణ జరిపి దర్యాప్తు ప్రారంభించారు.
బాణసంచా పేలి
ముగ్గురు దుర్మరణం
ఆరుగురికి తీవ్రగాయాలు

ప్రమాద స్థలంలో గుమిగూడిన జనం