
కంటైనర్ కింద దూసుకెళ్లిన కారు
వేలూరు: వాలాజ సమీపంలో రోడ్డు పక్కన నిలిచి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. చైన్నె అడయారు ప్రాంతంలోని రామాపురానికి చెందిన తిరుమాల్(40). ఇతని భార్య అష్టలక్ష్మి. వీరికి తరణ్(14), తరుణిక(14), తనుష్క(14) ముగ్గురు పిల్ల్లలు. పడమర అన్నానగర్‌కు చెందిన తిరుమాల్ అక్క ఎయులరసి(42) వీరందరూ కలిసి ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో రెండు రోజుల క్రితం వేలూరు జిల్లా విరింజిపురంలోని అవ్వగారి ఇంటికి కారులో వెళ్లారు. బుధవారం సాయంత్రం తిరుమాల్ అక్క ఎయులరసితో పాటు ముగ్గురు పిల్లలు కలిసి కారులో చైన్నెకి బయలుదేరారు. కారు రాణిపేట జిల్లా వాలాజ సమీపంలోని దేవానం బైపాస్ వద్ద వెళుతుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తిరుమాల్, ఎయులరసి, కారు డ్రైవర్ అయ్యప్పన్ మృతిచెందారు. ముగ్గురు పిల్లలకు తీవ్రగాయాలు కావడంతో పోలీసులు వాలాజ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.