రూ.810 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు
భానుపురి (సూర్యాపేట) : ఎందరో త్యాగధనుల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో సూర్యాపేట జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని, రాష్ట్రీయ గేయాన్ని ఆలపించి జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఆరు గ్యారంటీలతో
ప్రజలకు సంక్షేమ పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు. మహాలక్ష్మీ పథకం కింద జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 5కోట్ల 13 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని పొంది రూ.307 కోట్ల 22 లక్షల మొత్తాన్ని ఆదా చేసుకున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో 46,587 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామని తెలిపారు.
పేదింటి ప్రజల కల సాకారం దిశగా..
పేదంటి ప్రజల కల సాకారం దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 12,868 ఇళ్లను కేటాయించామని, ఇందులో 6,032 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో సీతారామస్వామి గుట్ట వద్ద 2,160 గృహాలకు మిగిలిపోయిన నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. నాలుగు నియోజకవర్గాల పరిధిలో 675 రెండు పడకల గదులు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని తెలిపారు.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు..
కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.397 కోట్ల 24 లక్షల నిధులను బ్యాంకుల ద్వారా రుణాలుగా ఇప్పించామని, జిల్లాలో రెండు సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇరిగేషన్ పనులకు ప్రాధాన్యం
జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మోతె మండలం అన్నారెడ్డిగూడెం వద్ద పాలేరు వాగుపై ఎత్తిపోతల పథకం కోసం 204 కోట్ల నిధులు మంజూరయ్యాయని, భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. 39 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.206 కోట్ల 37 లక్షల మంజూరు చేసినట్లు తెలిపారు.
మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా..
జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వంద పడకల ఏరియా హాస్పిటల్ ను 400 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. నూతన పల్లె దావాఖాల నిర్మాణాలకు, వివిధ పనుల కోసం రూ.334 కోట్ల 85 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, ఎస్పీ నరసింహ ఉన్నారు.
ఫ త్వరలోనే ఇందిరమ్మ కుటుంబ
జీవిత బీమా పథకం ప్రారంభం
ఫ మహిళలకు రూ.307 కోట్ల
ఉచిత బస్సు ప్రయాణ లబ్ధి
ఫ ఇరిగేషన్ పనులకు అత్యధిక ప్రాధాన్యం
ఫ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఈ యాసంగి సీజన్‌లో రూ.810 కోట్ల విలువైన ధాన్యాన్ని 48,897 మంది రైతుల వద్ద సేకరించామని చెప్పారు. వీరికి ఇప్పటివరకు రూ.530 కోట్లను చెల్లించినట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద 478 మంది రైతులకు రెండు కోట్ల 72 లక్షల విలువైన వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందించినట్లు చెప్పారు. 2026– 27 వానాకాలంలో 50 శాతం సబ్సిడీపై 2500 క్వింటాల జీలుగు విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.


