తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలి

Jun 3 2026 1:21 AM | Updated on Jun 3 2026 1:21 AM

– శ్రీకాంతాచారి మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కాసోజు శంకరమ్మ

మోత్కూరు : హైదరాబాద్‌లోని కొత్తపేట ప్రూట్‌ మార్కెట్‌ స్థలంలో ప్రభుత్వం నిర్మిస్తున్న వెయ్యి పడకల ఆసుపత్రికి తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆయన మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కాసోజు శంకరమ్మ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్‌ చౌరస్తాలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని తన కొడుకు ఆత్మాహుతి చేసుకున్నాడని, ఆస్పత్రికి శ్రీకాంతాచారి పేరు పెట్టడంతో ఆత్మ శాంతిస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, నెలకు రూ.25 వేల పింఛన్‌, ఆరోగ్య భద్రత కార్డులు అమలు చేస్తే ఆ కుటుంబాలు ఆత్మ గౌరవంగా బతుకుతాయని అన్నారు. కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి, జయంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలుగా తనను నియామకం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

తహసీల్దార్‌కు డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగోన్నతి

పాలకవీడు: పాలకవీడు తహసీల్దార్‌గా పనిచేస్తున్న ప్రమీలకు డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగోన్నది లభించింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఆమె పేరు ఉండడంతో ప్రమీలను మండల అధికారులు అభినందించారు.

మూగజీవాలకు పెంటయ్య సేవలు అభినందనీయం

కోదాడరూరల్‌ : కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పెంటయ్య మూగజీవాలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని రిటైర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు సీతరామయ్య కొనియాడారు. మంగళవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్‌ భవనంలో డాక్టర్‌ పెంటయ్య విశిష్ట సేవలను అభినందిస్తూ ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్‌ పెంటయ్య కోదాడ ప్రాంతంలోని పశువులకే కాకుండా పక్క జిల్లాలు, పొరుగున ఉన్న ఏపీ ప్రాంత మూగజీవాలకు కూడా వైద్య సేవలు అందించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఉద్యోగులు పాల్గొన్నారు.

గ్రామీణ నిరుద్యోగులకు

ఉచిత శిక్షణ

నల్లగొండ : ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గ్రామీణ నిరుద్యోగులకు నెల రోజుల పాటు ఏసీ, ఫ్రిడ్జ్‌ రిపేర్‌, సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్‌సెటీ డైరెక్టర్‌ సియాజి రాయ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న నిరుద్యోగులకు శిక్షణ సమయంలో ఉచితవసతి, బోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు అర్హత, తదితర పూర్తి వివరాలకు 9701009265 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement