జ్వరమని పిలిస్తే తోడొచ్చిన అక్క.. చెల్లితో పాటే అనంతలోకాలకు | - | Sakshi
Sakshi News home page

జ్వరమని పిలిస్తే తోడొచ్చిన అక్క.. చెల్లితో పాటే అనంతలోకాలకు

Jun 3 2026 1:21 AM | Updated on Jun 3 2026 1:21 AM

అర్వపల్లి, వేలేరుపాడు : ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు చెలరేగి అక్కాచెల్లెళ్లు సజీవ దహనమాయ్యారు. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహడ్‌ గ్రామానికి చెందిన ఉయ్యాల గోపయ్యకు ఇద్దరు కుమార్తెలు పూలమ్మ(64), సావిత్రి(61) సంతానం. పూలమ్మకు జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన శిగ వెంకటేశంతో, సావిత్రికి ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడుకు చెందిన వలగాని ఉప్పలయ్యతో వివాహం జరిగింది. పూలమ్మ భర్త వెంకటేశం 12 ఏళ్ల కిందట, సావిత్రి భర్త గోపయ్య 20 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందారు. అక్కాచెల్లెళ్లకు సంతానం లేరు. భర్త మృతిచెందిన తర్వాత పూలమ్మ తన తల్లిగారి ఊరైన కాసర్లపహడ్‌కు వచ్చి తమ్ముడు ఉయ్యాల అంజయ్య ఇంట్లో ఉంటోంది. సావిత్రి వేలేరుపాడులోనే నివాసముంటూ కూల్‌డ్రింక్స్‌ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. సావిత్రి తన తమ్ముడు అంజయ్య కుమారుడు రవిని దత్తత తీసుకుంది.

జ్వరం వస్తుందని చెల్లె ఫోన్‌ చేయడంతో..

కాసర్లపహాడ్‌లో ఉంటున్న తన అక్క పూలమ్మకు నెల రోజుల కిందట సావిత్రి ఫోన్‌ చేసి తనకు జ్వరం వస్తుందని.. తగ్గే వరకు ఉండిపొమ్మని కోరింది. దీంతో పూలమ్మ వేలేరుపాడులో ఉంటున్న చెల్లెలు సావిత్రి వద్దకు వెళ్లి అక్కడే ఉంటుంది. సోమవారం రాత్రి సావిత్రి ఉంటున్న రేకుల ఇంట్లో అక్కాచెల్లెళ్లు ఇద్దరు వేర్వేరు మంచాలలో నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో సావిత్రి, పూలమ్మ సజీవ దహనమయ్యారు. ఇంట్లోని రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో పెద్దఎత్తున శబ్దాలు వచ్చాయి. మంటలు పక్కనే ఉన్న లక్ష్మి అనే మహిళ ఇంటికి కూడా వ్యాపించడంతో ఆ ఇల్లు కూడా దగ్ధమైంది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు కాసర్లపహాడ్‌ నుంచి మృతుల బంధువులు వేలేరుపాడుకు వెళ్లారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం పోలీసులు బంధువులకు అప్పగించగా, వారు అంత్యక్రియల నిమిత్తం కాసర్లపహాడ్‌కు తీసుకొచ్చారు.

హత్య చేసి కాల్చేశారా..?

ఈ అగ్ని ప్రమాదంపై మృతుల బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సావిత్రిది ఇల్లు రేకుల ఇల్లు కావడంతో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఒక కోణంలో పోలీసులు భావిస్తుండగా.. మరోవైపు గుర్తుతెలియని వ్యక్తులు అక్కాచెల్లెళ్లను హత్య చేసి, ఒంటిపై ఉన్న బంగారాన్ని కాజేసిన అనంతరం సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి సజీవ దహనం చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఏలూరు పోలీసులు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. ఘటనా స్థలంలోని విద్యుత్‌ వైర్లు, ఇతర వస్తువులను సేకరించి విజయవాడలోని రీజినల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత పర్యవేక్షణలో, కుక్కునూరు సీఐ ఎం. రమేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫ అగ్నిప్రమాదంలో అక్కాచెల్లెళ్లు సజీవ దహనం

ఫ ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడులో ఘటన

ఫ మృతుల తల్లిగారి ఊరు జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్‌

Advertisement
 
Advertisement
Advertisement