సూర్యాపేటటౌన్ : కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడి రాష్ట్రాన్ని సాధించించింది కేసీఆరేనని, అందుకే ఆయనను ప్రజలంతా తెలంగాణ జాతిపితగా పిలుస్తున్నారన్నారు. అది తట్టుకోలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు విషం కక్కుతున్నారని ఆరోపించారు. పదవులను సైతం పక్కనపెట్టి రాష్ట్ర సాధనకై ముందుకు నడిపిన గొప్పనేత కేసీఆర్ అని, బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. రైతాంగంతో పాటు అన్ని రంగాల వినియోగదారులకు 24 కరెంట్ ఇచ్చి చరిత్ర సృష్టించారన్నారు. ఇప్పటికే ఆంధ్ర పాలకులు, ఉద్యోగులు, ఆంధ్ర కుట్రదారుల పెత్తనం మొదలైందని, ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర అధికారుల పెత్తనం నడుస్తోందని విమర్శించారు. అప్రమత్తంగా ఉండి పోరాడకపోతే ఆగమైతమని, వాళ్ల కుట్రలను ఛేదించాలంటే మరొక తెలంగాణ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి


