నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి

Apr 5 2026 9:18 AM | Updated on Apr 5 2026 9:18 AM

సూర్యాపేట టౌన్‌ : కోర్టుల సిబ్బందితో సమన్వయంగా ఉంటూ వివిధ కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా పోలీసులు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కోర్టు విధులు, పెండింగ్‌ కేసుల్లో త్వరితగతిన పరిష్కారం తదితర అంశాలపై డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్‌లు, కోర్టు డ్యూటీ పోలీస్‌ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తీవ్రమైన కేసుల్లో నిందితులను వెంటనే న్యాయస్థానాల్లో హాజరుపరిచి రిమాండ్‌ తరలించాలన్నారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో శిక్షలు పడేలా చూడాలన్నారు. కక్షిదారులను సమన్వయం చేసి లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను దస్త్రాలను, సమన్లు, వారెంట్లను పరిశీలించి పెండింగ్‌ కేసుల పరిష్కారానికి సంబంధించి పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ రవి, డీఎస్పీలు ప్రసన్నకుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు, కోర్టు డ్యూటీ సిబ్బంది పాల్గొన్నారు.

ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే

ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్‌

బాధితులకు సౌలభ్యం కోసం ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్‌ నమోదు విధానాన్ని అమలు చేస్తున్నామని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, బలహీన పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. వివిధ కేసులకు సంబంధించి పోలీస్‌ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తే బాధితుల ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ఫిర్యాదు స్వీకరించి అక్కడే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని అందజేస్తారని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కరించాలి

ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement