నల్లగొండ : విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్‌సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, 327 యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండలో డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 8న తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. మీటర్ రీడింగ్ కార్మికులు, కలెక్షన్ ఏజెంట్లు, ఎస్‌పీఎం వర్కర్లు, సెక్యూరిటీ గార్డులకు జీఓ నంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిట్టబోయిన లింగస్వామి యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, అవుట రవీందర్, పురం రాంబాబు, మైనం ఊషయ్య, చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, దుప్పలపల్లి రమేష్, బొజ్జ సహదేవ్, మేకల భిక్షమయ్య, పెరిక శేఖర్, విజయ్, ఉమాదేవి, రఫీయా, శైలజ, లింగారెడ్డి, భూషణం, ఆవుల పరమేష్, శ్రీపతి రమేష్, ఎస్‌కే ఖాన్, మురళి తదితరులు పాల్గొన్నారు.
నీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన
నల్లగొండ టూటౌన్: యూనివర్సిటీలో నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ హాస్టల్ ఆవరణలో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ.. నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్నానం చేసేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థులకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


