ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,26,646 మంది ఓటర్లు
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఫ ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా 1250 పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే పోలీసుల లక్ష్యమన్నారు. డబ్బు, మద్యం, బహుమతులు అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయొద్దన్నారు. ఓటర్లు కానివారు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో ఉండకూడదని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరవద్దని, ఓటు వేయాలని 100 మీటర్ల పరిధిలో అభ్యర్థించవద్దన్నారు. ఎన్నికల సమయంలో కేసులు నమోదైతే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా, డీజేలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు ఐదంచెల పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
ఓటర్లు, అభ్యర్థులకు సూచనలు..
● మీ పేరు తాజా ఓటరు జాబితాలో ఉన్నదా, లేదా అని నిర్ధారించుకోండి.
● పోలింగ్ సెంటర్‌కు సెల్‌ఫోన్‌న్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మంట ప్రేరేపిత వస్తువులు తేవొద్దు, సెల్ఫీలు దిగొద్దు.
● మీ పోలింగ్ స్టేషన్ వివరాలు ముందుగానే చూసుకోండి.
● ఎన్నికల సంఘం చూపిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకటైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి తీసుకురండి.
● తెలియని వ్యక్తులకు ఓటర్ ఐడీ లేదా ఓటర్ స్లిప్ ఇవ్వొద్దు.
● రహస్య పద్ధతిలో ఓటు వేయాలి. ఫలానా గుర్తుకు ఓటు వేశానని బయటకు చెప్పవద్దు.
● కార్యకర్తలు, అభ్యర్థులు ఓటరు స్లిప్స్ పంచవద్దు.
● పోలింగ్ కేంద్రంలో క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోండి.
● పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయవద్దు.
● వేరొక ఓటరు పేరు మీద ఓటు వేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం.
ఫ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
ఫ ఐదు మున్సిపాలిటీల్లో 137 వార్డులకు ఎన్నికలు
ఫ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్
సూర్యాపేటటౌన్ : మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీల పరిధిలో 141 వార్డులకుగాను నాలుగు వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 137 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల అధికారులు ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రితో చేరుకున్నారు. మంగళవారం ఉదయం నుంచే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రిని తరలించారు.
137 వార్డులు.. 612 మంది అభ్యర్థులు
మున్సిపాలిటీ ఎన్నికలకు జనవరి 27న నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే నామినేషన్ల స్వీకరణ, అనంతరం ఉపసంహరణ, ఈ నెల 4వ తేదీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకుగాను 141 వార్డులు ఉండగా.. అందులో కోదాడలో మూడు, హుజూర్‌నగర్‌లో ఒకటి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 137 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 612 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీల మధ్యే గట్టి పోటీ ఉంది. కొన్నిచోట్ల రెబల్స్ సైతం గట్టి పోటీ ఇవ్వనున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో గల 137 వార్డుల్లో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 372 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కట్టుదిట్టంగా నిర్వహించేందుకు 446 మంది పోలింగ్ అధికారులు, 446 మంది ఏపీఓలు, 1340 మంది ఓపీఓలను నియమించారు. అదేవిధంగా 51 మంది జోనల్ అధికారులు, 46 మంది రూట్ అధికారులను నియమించారు. 10 ఎస్‌ఎస్‌టీ, 15 ఎఫ్‌ఎస్‌టీ, 7 వీవీటీ, 7 ఏటీ బృందాలను ఏర్పాటు చేశారు. 55 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పోలీస్ ఎస్కార్టుతో ఎన్నికల సామగ్రి పోలింగ్ కేంద్రాలకు, తిరిగి పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్‌కు తరలించేందుకు 46 బస్సులను ఏర్పాటు చేశారు.
అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీలో..
జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 2,26,646 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళలు 1,17,843 మంది ఉండగా పురుషులు 1,08,763 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఇతరులు 40 మంది ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులకుగాను 1,08,848 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డులకు గాను 13,746 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
పటిష్ట బందోబస్తు..
ఐదు మున్సిపాలిటీల్లో జరుగనున్న ఎన్నికలకు సంబంధించి ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లాలో 1250 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తులో అదనపు ఎస్పీలు ఇద్దరు, డీఎస్పీలు నలుగురు, ఇన్‌స్పెక్టర్లు 12 మంది, సబ్ ఇన్‌స్పెక్టర్లు 50, ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుళ్లు 265 మంది, కానిస్టేబుళ్లు 760, హహోంగార్డులు 152, మహిళా సిబ్బంది 90 మంది, స్పెషల్ పార్టీ టీమ్స్, బాంబ్ స్క్వాడ్ టీమ్స్, స్టైకింగ్ ఫోర్స్ టీమ్స్ ఐదు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ ఐదు, ప్రతి మున్సిపాలిటీకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్ చొప్పున 15 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు విధులను నిర్వర్తించనున్నారు.
ప్రలోభాల పర్వం..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బరిలో ఉన్న అభ్యర్థులు మంగళవారం ఉదయం నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఒక్కో వార్డులో రూ.1000 నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. మహిళలకు చీరలు, పురుషులకు ఖరీదైన మద్యం బాటిళ్లను సైతం పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించినట్టు సమాచారం.
మున్సిపాలిటీల్లో ఇలా..
మున్సిపాలిటీ వార్డులు ఏకగ్రీవం ఓటర్లు
కోదాడ 35 03 8601
హుజూర్‌నగర్ 28 01 29996
నేరేడుచర్ల 15 00 13746
తిరుమలగిరి 15 00 15455
సూర్యాపేట 48 00 108848
మొత్తం 141 04 2,26,646
ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,26,646 మంది ఓటర్లు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,26,646 మంది ఓటర్లు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,26,646 మంది ఓటర్లు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,26,646 మంది ఓటర్లు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,26,646 మంది ఓటర్లు


