రేపటి నుంచి కనకదుర్గమ్మ జాతర | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి కనకదుర్గమ్మ జాతర

Feb 11 2026 8:49 AM | Updated on Feb 11 2026 8:49 AM

రేపటి నుంచి కనకదుర్గమ్మ జాతర

రేపటి నుంచి కనకదుర్గమ్మ జాతర

చిలుకూరు : చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో గురువారం నుంచి కనకదుర్గమ్మ జాతర నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జాతరను వైభవంగా జరిపేందుకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరలో భాగంగా గురువారం సాయంత్రం గ్రామస్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్తారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోలాట ప్రదర్శనలు, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, శనివారం ఉదయం కోలాట ప్రదర్శనలు ఉంటాయి. అదేరోజు సాయంత్రం ప్రభ బండ్లను ఆలయం వద్ద నుంచి ఇళ్లకు తీసుకెళ్తారు.

వివిధ పార్టీల ఆధ్వర్యంలో..

జాతర సందర్భంగా ప్రతి ఏడాది బేతవోలు గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో కోలాటాలు, లైటింగ్‌ ప్రభలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది విభేదాల కారణంగా అధికార కాంగ్రెస్‌ పార్టీలో రెండు వర్గాలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో సర్పంచ్‌ వట్టికూటి నాగయ్య వర్గం ఆధ్వర్యంలో ఉదయం రాష్ట్రస్థాయి ఎద్దుల పందేలు, శుక్రవారం రాత్రి మ్యూజికల్‌ లైటింగ్‌ అర్కెస్ట్రాతో పాటల కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో కాంగ్రెస్‌ వర్గం ఉదయం కోలాటాలు, రాత్రి లైటింగ్‌ ప్రభలు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు ఉదయం కోలాటాలు, శుక్రవారం రాత్రి లైటింగ్‌ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక సీపీఐ నుంచి బహ్కిరించబడిన మట్టయ్య తన వర్గంతో కోలాటాలు, లైటింగ్‌ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 7 లైటింగ్‌ ప్రభల ఏర్పాటుకు పార్టీల నాయకులు సిద్ధం చేసుకుంటున్నారు.

60 మంది బైండోవర్‌

బేతవోలు జాతరలో రాత్రి జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు పోలీసులు గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అనుమతులు ఇవ్వడం లేదు. గతంలో జాతరలో పార్టీల మధ్య ఘర్షణలు జరగడంతో పోలీసులు రాత్రి జరిగే కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వడం లేదు. పార్టీల నాయకులు మాత్రం స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లి అనుమతులకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్పీ దగ్గర అనుమతి కోసం తిరుగుతున్నారు. అయితే పోలీసులు ముందస్తుగా గ్రామంలోని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తదితర పార్టీల నుంచి ఇప్పటికే 60 మందికిపైగా కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో బైండోవర్‌ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చిలుకూరు ఎస్‌ఐ హనుమాన్‌నాయక్‌ ఆధ్వర్యంలో ఏడుగురు ఎస్‌ఐలు, ప్రత్యేక పోలీస్‌ బలగాలు, సివిల్‌ పోలీసులు 70 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఫ బేతవోలు ఆలయంలో

వేడుకలకు ఏర్పాట్లు

ఫ రాత్రి వేళ సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వని పోలీసులు

ఫ మంత్రి, అధికారుల చుట్టూ తిరుగుతున్న నిర్వాహకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement