భక్తుల జేబులకు చిల్లు
ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట) : శ్రీ దండు మైసమ్మ తల్లి ఆలయం వద్ద పూజా సామగ్రి, కొబ్బరికాయలను అధిక ధరలకు విక్రయిస్తుండడంతో భక్తుల జేబులకు చిల్లు పడుతోంది. ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకునేందుకు వేలమంది భక్తులు వస్తుంటారు. విక్రయదారులు పూజా సామగ్రి ధరల రేట్లు ఇష్టానుసారంగా పెంచి భక్తుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ విషయమై పలుమార్లు భక్తులు, గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దండు మైసమ్మ ఆలయం వద్ద వాహనాల పూజ కోసం ఉపయోగించే సామగ్రి ఐదు నిమ్మకాయలు, మూడు జీడిగింజలు, ఒక కొబ్బరికాయ, ఒక దట్టి రూ.200లకు భక్తులకు విక్రయిస్తున్నారు. భక్తులు అమ్మవారికి సమర్పించే కొబ్బరికాయలను సైతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా పూజ సమయంలో వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని స్థానికులు, భక్తులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆలయ సమీపంలో పూజా సామగ్రి, కొబ్బరికాయల ధరలను నియంత్రించాలని, రోడ్డుపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఫ పూజా సామగ్రి, కొబ్బరికాయలు అధిక ధరలకు విక్రయం
ఫ ఇష్టానుసారంగా రేట్లు పెంచి అమ్ముతున్న దుకాణదారులు


