సంక్షేమానికే మీ ఓటు | - | Sakshi
Sakshi News home page

సంక్షేమానికే మీ ఓటు

Feb 5 2026 7:11 AM | Updated on Feb 5 2026 7:11 AM

సంక్షేమానికే మీ ఓటు

సంక్షేమానికే మీ ఓటు

మిర్యాలగూడ : కాంగ్రెస్‌ పాలనలో పేదలు, గిరిజనులు, మహిళలు, విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో సంక్షేమానికి పట్టం కట్టేలా కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బుధవారం మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు.. కాంగ్రెస్‌ పార్టీకి అడ్డాగా మారాలన్నారు. కాంగ్రెస్‌ రెండు సంవత్సరాల పాలనలో లక్షలాది మందికి రేషన్‌కార్డులు అందించి, ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చి పేదలకు కడుపు నిండా అన్నం పెడుతున్నామన్నారు. మిర్యాలగూడ ప్రాంతం ఆసియా ఖండంలోనే రైస్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా పేరుగాంచిందని అన్నారు. ఇక్కడ అధునాతన రైస్‌ మిల్లులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సన్న వడ్లను మద్దతు ధరకు కొని.. బోనస్‌ రూ.500 ఇస్తున్నామన్నారు. 25.35లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.6 వేలు ఇస్తున్నామని.. త్వరలో మరో రూ.9వేల కోట్లను విడుదల చేసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తామన్నారు.

రూ.22,500 కోట్లతో ఇళ్ల నిర్మాణం

వైఎస్సార్‌ హయాంలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని, కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇస్తామని పదేండ్లలో ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం రూ.22,500 కోట్లతో నియోజకవర్గానికి 3500 ఇళ్లను పేదలకు ఇచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ ప్రాంతమని, ఈ సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులు కట్టించామన్నారు. 3.60 లక్షల ఎకరాలకు నీరు అందించే ఎస్‌ఎల్‌బీసీని నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడరు

జానారెడ్డి నమ్మి భాస్కర్‌రావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలను ఆయన మోసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్లు వాపస్‌ తీసుకోవాలని భాస్కర్‌రావు బెదిరిస్తున్నారని.. ‘మా అభ్యర్థులను బెదిరిస్తే భాస్కర్‌రావు.. నీకు చింతపండు అవుతుంది’ అని హెచ్చరించారు. ఆయన బెదిరింపులకు కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడరని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. సర్పంచ్‌లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు అందరూ మనోళ్లే ఉన్నారని.. కౌన్సిలర్లు వేరే వాళ్లు ఉంటే పనిచేయరని, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఫ రూ.17,472 కోట్లతో పట్టణాలను అభివృద్ధి చేస్తున్నాం

ఫ సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం

ఫ ఎస్‌ఎల్‌బీసీని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎండబెట్టింది

ఫ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement