వర్థెల్లి బుచ్చిరాములు జీవితం స్ఫూర్తిదాయకం
సూర్యాపేట అర్బన్ : తన జీవితాంతం పార్టీ కోసం, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసిన గొప్ప వ్యక్తి వర్థెల్లి బుచ్చి రాములు అని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి కొనియాడారు. సీపీఎం సీనియర్ నేత వర్థెల్లి బుచ్చిరాములు వర్ధంతి సందర్భంగా బుధవారం సూర్యాపేటలోని ఎంవీఎన్ భవన్‌లో ఆయన చిత్ర పటానికి పలువురు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన బుచ్చిరాములు చిన్నతనంలోనే ఎర్రజెండా చేతబట్టి ప్రజా పోరాటాలకు దగ్గరయ్యారని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బుచ్చిరాములు తుంగతుర్తి, సూర్యాపేట ఉమ్మడి డివిజన్ వ్యాప్తంగా భూ పోరాటాలు చేశారని, కార్మికులు, కర్షకులు, పేద వర్గాలకు అండగా నిలిచి ఉద్యమాలు నిర్మించారని పేర్కొన్నారు. సూర్యాపేట సీపీఎం ఆఫీస్ కార్యదర్శిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు. సూర్యాపేట తాలూకాలో జరిగిన నిర్బంధాలు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో బుచ్చిరాములు పాత్ర మరువలేనిదన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన కార్యకర్తలను నాయకులుగా తయారు చేసిన ఘనత బుచ్చిరాములుకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు ధని యాకుల శ్రీకాంత్, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, అబ్బగాని భిక్షం, బత్తుల వెంకన్న పాల్గొన్నారు.
సీపీఎం వాణిజ్య భవన్ ఆధ్వర్యంలో..
సూర్యాపేటలోని సీపీఎం వాణిజ్య భవన్ ఆధ్వర్యంలో వర్థెల్లి బుచ్చిరాములు వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి వాణిజ్య భవన్ కార్యదర్శి బొ మ్మిడి లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. ప్రజల కోసం బుచ్చి రాములు నిర్మించిన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. దురాజ్‌పల్లిలో వివేకానంద వృద్ధాశ్రమంలో బొమ్మిడి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, భద్రమ్మ, బొమ్మిడి అశోక్, వేల్పుల వెంకన్న, సాయికుమార్, ఆసిఫ్, ప్రసాద్ పాల్గొన్నారు
నివాళర్పిస్తున్న సీపీఎం వాణిజ్య భవన్ కార్యదర్శి లక్ష్మీనారాయణ
వర్థెల్లి బుచ్చిరాములు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మల్లు నాగార్జునరెడ్డి, నాయకులు
ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
వర్థెల్లి బుచ్చిరాములు జీవితం స్ఫూర్తిదాయకం


