అప్పులు చేస్తూ.. అవస్థలు పడుతూ!
అర్వపల్లి : వేతనాలు అందక ఇ–పంచాయతీ ఆపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ ఖర్చులు, చిట్టీలు, బ్యాంకులకు చెల్లించాల్సిన వాయిదాలకు అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆపరేటర్ల విధులు ఇవీ..
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఇ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లను నియమించింది. గ్రామ పంచాయతీల్లో జనన, మరణ ధ్రువపత్రాలు, పన్నుల వసూళ్లు, ప్రభుత్వ పథకాల అమలు, గృహ నిర్మాణాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తుంటారు. అలాగే ప్రభుత్వ సర్వేలకు సంబంధించిన వివిధ రిపోర్టులు చేయడం, స్థానిక ఎన్నికలు.. ఇలా ప్రతి అంశంలో ఈ–పంచాయతీ ఆపరేటర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. అవసరాన్ని బట్టి అదనపు గంటలు పని చేయాల్సి ఉంటుంది. కానీ, వారికి వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
63 మంది నిరీక్షణ
జిల్లాలో 63 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి గతంలో నెలకు రూ.22,750 వేతనం ఇస్తుండగా.. అందులో కోత విధించి ప్రస్తుతం రూ.19,500 చెల్లిస్తున్నారు. అది కూడా క్రమం తప్పకుండా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నుంచి వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నామని వాపోతున్నారు. కాగా వేతన బకాయిలు విడుదల చేయకపోతే సమ్మెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఇ–పంచాయతీ ఆపరేటర్లకు నెలనెలా అందని వేతనాలు
నాలుగు మాసాలుగా పెండింగ్
కుటుంబ పోషణ కోసం
అప్పులు చేస్తున్నామని ఆవేదన
కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉంది
చాలీచాలని వేతనాలతో ఆపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అవి కూడా నెలనెలా ఇవ్వడం లేదు. నాలుగు నెలలుగా వేతనాలు నిలిచిపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉంది. ఇంటి ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి.
– చింతల సురేష్, ఇ–పంచాయతీ కంప్యూటర్
ఆపరేటర్ల సంఘం తుంగతుర్తి అధ్యక్షుడు


