ప్రజల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యం
సూర్యాపేటటౌన్ : అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా ప్రజల భద్రత, రక్షణే లక్ష్యంగా పోలీసు శాఖ పని చేస్తుందని జిల్లా పోలీసుల సంఘం అధ్యక్షుడు రామచందర్‌గౌడ్ శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. రాజేష్ మృతి విషయంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎలాంటి తారతమ్యం లేకుండా పోలీస్ శాఖ పనిచేస్తుందని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు కావని, పోలీసు శాఖ ప్రతిష్ట, పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా మల్లయ్య యాదవ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు ఆరోపణలు చేసే వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు.
మునగాల
ఎంఈఓకు ప్రశంసలు
మునగాల: మండల విద్యాధికారి పిడతల వెంకటేశ్వర్లుకు రాష్ట్రస్థాయిలో ప్రశంసలు దక్కాయి. హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన తెలంగాణ శాటిలైట్ (టి–శాట్) ఫౌండేషన్ లిటరసీ స్టడీ (ఎఫ్‌ఎల్‌ఎస్) ప్యానల్ డిస్కస్ లైవ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని జిల్లాలో ఎఫ్‌ఎల్‌ఎస్ ప్రోగ్రాం అమలు జరుగుతున్న తీరుపై వివరించారు. తమ మండలాల్లో ఫౌండేషన్ లిటరసీ ప్రోగ్రాం (ఎఫ్‌ఎల్‌ఎస్) సమర్థవంతంగా అమలు చేసినందుకు గాను రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంఈఓలు ఎంపికవగా అందులో పిడతల వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆయన రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితారాణి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోస్‌ల చేతుల మీదుగా ప్రశంసాపత్రం, మెమొంటో అందుకున్నారు. వెంకటేశ్వర్లును ఉపాధ్యాయులు అభినందించారు.
బాలికా విద్యతోనే
నవ సమాజ స్థాపన
పెన్‌పహాడ్: బాలికా విద్య, సాధికారతతోనే నవ సమాజ స్థాపన సాధ్యమని జిల్లా సంక్షేమ అధికారి నర్సింహరావు అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శనివారం పెన్‌పహాడ్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి అమ్మాయి తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. డీఎంహెచ్‌ఓ వెంకటరమణ మాట్లాడుతూ బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సీడీబ్ల్యూసీ చైర్మన్ రమణారావు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికుమార్, మహిళా సాధికారత కేంద్రం కో–ఆర్డినేటర్ చైతన్య, సఖి కేంద్రం సీఏ హేమలత, పాఠశాల ఎస్‌ఓ ఆసియాజబిన్, ఎయిడ్ ఎన్‌జీఓ సోమన్న, వైద్యాధికారి రాజేష్, సీడబ్ల్యూసీ సభ్యులు, చైల్డ్‌లైన్ సిబ్బంది పాల్గొన్నారు.
గోదావరి జలాల పెంపు
అర్వపల్లి: ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశ ద్వారా జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలను పెంచారు. రెండో విడత కింద తొలిరోజు 1,337 క్యూసెక్కుల నీటిని వదలగా, శనివారం 1,700 క్యూసెక్కులకు పెంచారు. ఈ నీటిని 69,70,71 డీబీఎంలకు వదులుతున్నట్లు జలవనరులశాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. రైతులు కాలువలకు అడ్డుకట్ట వేయకుండా నీటిని వాడుకోవాలని సూచించారు.
ప్రజల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యం


