విద్యార్థి దశలోనే లక్ష్యం ఎంచుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థి దశలోనే లక్ష్యం ఏర్పరచుకుని సాధనకోసం కృషి చేస్తే ఉన్నతస్థాయికి ఎదుగుతారని సూర్యాపేట జిల్లా కోర్టు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శనివారం సూర్యాపేటలోని నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాలికల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థానాలకు చేరాలన్నారు. తల్లిందండ్రుల కలలను సాకారం చేయాలని, చదివిన పాఠశాలకు పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డీఎల్‌ఎస్‌ఎ నామినేషన్ సభ్యులు గుంటూరు మధు, నల్లపాటి మమత, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


