ఇంటర్‌లోనూ ‘డిజిటల్’
సూర్యాపేటటౌన్ : పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెరుగైన బోధనే లక్ష్యంగా ప్రభుత్వం విద్యావ్యవస్థల్లో మార్పులు తీసుకువస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన బోధన అందించాలన్నదే లక్ష్యం. ప్రస్తుతం సర్కారు స్కూళ్లలో డిజిటల్ విద్యనందిస్తున్నారు. కార్పొరేట్‌కు దీటుగా డిజిటల్ బోర్డుల ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా డిజిటల్ బోధన అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా వాటికి డిజిటల్ బోర్డులు పంపిణీ చేసింది.
ప్రతి కళాశాలకు నాలుగు డిజిటల్ బోర్డులు
ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్‌సీ) బోర్డుల ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధిస్తున్నారు. జిల్లాలోని ప్రతి కళాశాలకు నా లుగు చొప్పున ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మొత్తం 32 బోర్డులను ఇంటర్ బోర్డు అందజేసింది. అయితే ఆయా కళాశాలల్లో డిజిటల్ బోర్డుల బిగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అందుబాటులోకి వచ్చిన చోట డిజిటల్ బోర్డుపైనే బోధిస్తున్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇప్పటికే డిజిటల్ విధానంలో పాఠాలు బోధిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 32 డిజిటల్ బోర్డులను ఇంటర్‌బోర్డు అందజేసింది. ఒక్కో కళాశాలకు నాలుగు చొప్పున వచ్చాయి. ఇప్పటికే కొన్ని కళాశాలల్లో బోర్డుల బిగింపు పూర్తికావడంతో బోధన సైతం ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఇవి వినియోగిస్తారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ర్యాంకులు సాధించాలి.
– భానునాయక్, డీఐఈఓ
కార్పొరేట్‌కు దీటుగా పాఠాలు
జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ కళాశాలలు
అంతటా డిజిటల్ బోర్డులు ఏర్పాటు, మొదలైన బోధన


