ఆలయంలో హుండీ అపహరణ
మేళ్లచెరువు : మేళ్లచెరువు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన శ్రీగోపయ్య సమేత శ్రీలక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో హుండీని శుక్రవారం రాత్రి ఓ దుండగుడు అపహరించాడు. శనివారం ఉదయం గ్రామస్తులు దేవాలయానికి వచ్చి చేసేసరికి హుండీ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని దేవాలయంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అందులో ఓ దుండగుడు హుండీని ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు. కాగా గత నెల 27నే ఈ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. శుక్రవారం 16 రోజుల పండగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అదేరోజు రాత్రి హుండీని చోరీకి గురికావడం కలకలం రేపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


