ఇక.. ప్రలోభాల ఎర | - | Sakshi
Sakshi News home page

ఇక.. ప్రలోభాల ఎర

Dec 10 2025 7:33 AM | Updated on Dec 10 2025 7:33 AM

ఇక.. ప్రలోభాల ఎర

ఇక.. ప్రలోభాల ఎర

జోరందుకున్న రెండో విడత ఎన్నికల ప్రచారం

ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం

సూర్యాపేట : మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో పరిసమాప్తం అయ్యింది. ఇక గప్‌చుప్‌గా ప్రలోభాల ఎరకు అభ్యర్థులు తెరలేపారు. డబ్బు, మద్యం, విందులు, చికెన్‌ పంపిణీకి కసరత్తు చేస్తున్నారు. చివరి రోజు ప్రచారం హోరాహోరీగా సాగింది. తొలిదశ పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నాయి. తమ ప్రధాన మద్దతుదారులను గెలిపించేందుకు ప్రధాన పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు.

గెలుపే లక్ష్యంగా..

తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నూతనకల్‌, నాగారం, మద్దిరాల, సూర్యాపేట, ఆత్మకూర్‌ (ఎస్‌) మండలాల్లో సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. చివరి రోజు మంగళవారం సైతం ప్రచారంతో హోరెత్తించారు. బహిరంగ ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. మరోవైపు రెండో విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లోనూ ప్రచారం జోరందుకుంది. ప్రధానంగా జనరల్‌, బీసీ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ప్రచారం ముగియగానే అభ్యర్థులు తమ ప్రత్యర్థులు ఓటుకు ఎంత ఇస్తున్నారో తెలుసుకుని అంతకంటే కొంత ఎక్కువ ఇచ్చేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఎలాగైనా గెలిచితీరాలని డబ్బు, మద్యంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ఆధారంగా తమకు పడే ఓట్ల కోసం గుట్టుచప్పుడు కాకుండా డబ్బుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. ఏ దారిలో ఓటరుకు డబ్బులు చేరవేయాలని అభ్యర్థులు చూస్తుంటే.. డబ్బులు ఎవరు పంచుతున్నారంటూ ఓటర్లు ఇప్పటికే ఆరా తీస్తున్నారు.

ఖర్చుకు వెనుకాడకుండా..

నామినేషన్ల ఉపసంహరణ రోజు నుంచి కొందరు నాయకులు, ఓటర్లు సానుభూతిపరులను మద్యం మత్తులో ముంచేశారు. ఇప్పుడు ఓటర్లు చేజారకుండా ఉండేందుకు అభ్యర్థులు ఏ వాడ ఓటర్లను ఆ వాడలో ప్రత్యేక సిట్టింగులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం మద్యం డంప్‌ చేసి వారికి తాగినంత అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే వాతావరణం నేడు, రేపు రెండు రోజుల పాటు అభ్యర్థులకు తప్పేలా లేదు. ముందు ఖర్చు పెట్టేందుకే ఆలోచించిన అభ్యర్థులు పోలింగ్‌ సమయం దగ్గర పడటంతో ఒకరిని మించి మరొకరు ఖర్చు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పలువురు అభ్యర్థులు తమకు వచ్చిన ఎన్నికల గుర్తులను ఓటర్లకు పంచుతున్నారు. ప్రధానంగా ఉంగరం గుర్తు వచ్చిన అభ్యర్థులు సిల్వర్‌, రాగి ఉంగరాలు అందజేస్తున్నారు. స్టూలు గుర్తు వచ్చిన వారు వాటిని పంచుతున్నారు. ఇంకా మిక్సీలు, చీరలు, సెల్‌ఫోన్‌లు, క్రికెట్‌ బ్యాట్‌లు పంపిణీ చేస్తున్నారు.

రెండో విడత ఎన్నికలు జరుగుతున్న కోదాడ, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు, మోతె, చివ్వెంల, పెన్‌పహాడ్‌ మండలాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి తమను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు తమ మద్దతు దారుల కోసం రోడ్‌షోలు, గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 14న రెండో విడత ఎన్నికల్లో మెజార్టీ స్థానాల విజయంపై ప్రధాన పార్టీలు కన్నేశాయి.

ఫ మద్యం, డబ్బు పంపిణీ.. విందులు

ఫ ఓటర్లను మచ్చిక

చేసుకోవడానికి అభ్యర్థుల తంటాలు

ఫ రేపే మొదటి విడత పోలింగ్‌.. కౌంటింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement