పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండు, మూడు విడతల్లో విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్‌లాల్ పవార్ ఒక ప్రకటనలో కోరారు. రెండవ విడత అనంతగిరి, చిలుకూరు ,చివ్వెంల, కోదాడ, మోతె, మునగాల, నడిగూడెం, పెన్‌పహాడ్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఇందుకు సంబంధించి అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు ఈ నెల 7నుంచి 10వ తేదీ వరకు ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే మూడవ విడత ఎన్నికలు జరిగే చింతలపాలెం, గరిడేపల్లి, హుజూర్‌నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఈనెల 10,12,13,15 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని శివాలయంలో మంగళవారం సాయంత్రం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి భక్త కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఏకాదశరుద్రాభిషేకం చేపట్టారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తాలిబొట్టు తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, అర్చకులు దుర్గాప్రసాద్‌శర్మ, లక్ష్మీనరసింహ మూర్తి, నాగభూషణం, సీతారామాచార్యులు, శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.
ఎంజీయూ ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్ డైరెక్టర్‌గా శ్వేత
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్ డైరెక్టర్‌గా ఎంజీయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సూరం శ్వేతను నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు శ్వేత ఈ పదవిలో కొనసాగనున్నారు. దేశ, విదేశాల్లోని యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ఎంజీయూకు అనుసంధాన పర్చేందుకు కృషి చేయనున్నారు. ఈ సందర్భంగా శ్వేతను వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అలువాల రవి అభినందించారు.
ఆంజనేయస్వామికి
నాగవల్లి దళార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడైన శ్రీఆంజనేయస్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో ఉన్న శ్రీఆంజనేయ స్వామికి అర్చకులు అభిషేకం జరిపించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి నాగవల్లి దళార్చన చేపట్టారు. పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవాలి


