కేజీబీవీలకు బంకర్ బెడ్లు
నాగారం : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినుల కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. కొన్నేళ్లుగా రాత్రి సమయంలో విద్యార్థినులు నిద్రించేందుకు మంచాలు లేకపోవడంతో నేలపై చాపలు, దుప్పట్లు వేసుకొని కాలం వెల్లదీశారు. ఈ సమస్యను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు బంకర్ బెడ్లు (డబుల్ డెక్కర్, డార్మిటరీ మంచాలు) అందించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సమగ్రశిక్ష రాష్ట్ర సంచాలకులు ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించారు. ఇప్పటికే విద్యార్థినుల వివరాలు, ఎన్ని బంకర్ బెడ్లు అవసరమో ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు.
ఇద్దరికి ఒకటి చొప్పున..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 కేబీబీవీలు ఉన్నాయి. వీటిలో కొన్ని చోట్ల ఆరు నుంచి పదోతరగతి వరకు.. మరికొన్నింట్లో ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యాలయాల్లో 3,409 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులకు ఇద్దరికి చొప్పున వీటిని అందజేయనున్నారు. మొత్తం 1,700 వరకు బంకర్లు రానున్నాయి. ఇందులో కింద ఒకటి, పై భాగంలో మరో బెడ్ ఉండనుంది. రాత్రి సమయంలో పిల్లలు నిద్రించిన తరువాత కింద పడకుండా చుట్టూ రక్షణ ఉండేలా వాటిని తీర్చిదిద్దారు. సులభంగా పైకి ఎక్కేందుకు అవరమైన ఏర్పాట్లతో రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కేజీబీవీల్లో సరైన వసతులు లేక విద్యార్థినులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రభుత్వం ఎట్టకేలకు బంకర్ బెడ్లు అందించడానికి నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సరఫరా అయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
ఫ ఇద్దరికి ఒకటి చొప్పున
అందించేందుకు కసరత్తు
ఫ తీరనున్న విద్యార్థినుల కష్టాలు
ఫ వివరాలు సేకరించి నివేదిక
సమర్పించే పనిలో అధికారులు
కస్తూర్బా విద్యాలయాలు: 18
విద్యార్థినులు: 3,409
రానున్న బంకర్‌బెడ్లు: 1,700


