ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
సూర్యాపేటటౌన్ : ‘మొదటి విడత ఎన్నికలు జరిగే ఎనిమిది మండలాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ప్రచార ముగిసింది. ఎవరు కూడా ఇక ప్రచారం చేయవద్దు.. డబ్బు, మద్యం, బహుమతులు అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయవద్దు’ అని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోషల్ మీడియాపై జిల్లా పోలీస్ శాఖ నిశిత పరిశీలన ఉందని, ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించినా, తప్పుడు సమాచారం ప్రచారం చేసినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
1500 మంది సిబ్బందితో ఐదెంచల భద్రత
సూర్యాపేట, ఆత్మకూరు, నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి మండలాల్లో 1,500 మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికలకు ఐదెంచల పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఆన్‌లైన్ వెబ్ కాస్టింగ్ ఉంటుందని, దీని ద్వారా ఈ కేంద్రాలలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.
కేసులు..
మూడు విడతల్లో 170 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నవారు, రౌడీలు, పాత నేరస్తులు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న 1,284 మందిని ముందస్తుగా బైండోవర్ చేసినట్లు వివరించారు. 136 కేసుల్లో రూ.9.50 లక్షలు విలువైన 1,425 లీటర్ల మద్యం సీజ్ చేశామని 53 లైసెన్స్‌డ్ ఆయుధాలు డిపాజిట్ చేయించినట్లు పేర్కొన్నారు.
ఓటర్లు, అభ్యర్థులకు సూచనలు..
ఫ మీ పేరు తాజా ఓటర్ జాబితాలో ఉన్నదా, లేదా నిర్ధారించుకోండి.
ఫ పోలింగ్ సెంటర్ కు సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావొద్దు, సెల్ఫీలు దిగవద్దు.
ఫ మీ పోలింగ్ స్టేషన్ వివరాలు ముందుగానే చూసుకోండి.
ఫ పోలింగ్ రోజున ఎన్నికల సంఘం చూపిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకటైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురండి.
ఫ వేరొక ఓటరు పేరు మీద ఓటు వేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. దీనికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
ఫ కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి.
ఫ ఎస్పీ నరసింహ


