కాంగ్రెస్ పాలనలో అరాచకాలు
సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి పాలనలో అరాచకాలు చూస్తున్నామని, కేసీఆర్ అంటే అభివృద్ధి.. రేవంత్ అంటే దందాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని తాళ్ల ఖమ్మంపహాడ్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేండ్లు కేసీఆర్ పాలన ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. రేవంత్ మాయమాటలకు మోసపోయామని తేలిపోయిందని, కేసీఆర్‌ను దూరం చేసుకున్నామని అంతా ఇప్పుడు బాధపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులంతా కమీషన్లు, కబ్జాల పనిలో పడ్డారని విమర్శించారు. నిరంతరం అభివృద్ధి పనులకు కేసీఆరే చిరునామా అని, బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పా.. కొత్తగా చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల వల్లనే ఏ అభివృద్ధి జరగడం లేదని, ఇక ఆ పార్టీ సర్పంచ్‌లను గెలిపిస్తే మాత్రం ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్‌ఎస్ పార్టీయేనని, అందుకే బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్లను గెలిపించాలని కోరారు.
ఫ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి


