కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
చివ్వెంల : కేసుల పరిష్కారంలో మీడియేషన్, ప్యానల్ న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. లక్ష్మీశారద సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో మీడియేషన్, ప్యానల్ న్యాయవాదులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల విషయంలో కక్షిదారులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్, సీనియర్ సివిల్ జడ్జి పర్వీన్‌కౌసర్, న్యాయవాదులు పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి సోమవారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు,అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తి కట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ, సీతారామా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
శివుడికి
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా యాదగిరికొండపై ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో బిల్వార్చన, రుద్రాభిషేకం, ఆలయ ముఖమండపంలోని స్పటిక లింగానికి అభిషేకం చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రధానాలయంలో..
సోమవారం వేకువజామున ప్రధాన ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రఽభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ఆరాధనలు చేశారు. అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. ఇక ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆగమశాస్త్రం ప్రకారం పూర్తి చేశారు. గజవాహనసేవ.. స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం కనుల పండువగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, సువర్ణ పుష్పార్చన , సాయంత్రం వెండిజోడు సేవను ఘనంగా ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వార బంధనం చేశారు.
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి


