తొలిదశ ప్రచారం నేడు ఆఖరు
సూర్యాపేట : పంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెర పడనుంది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అయితే 48 గంటల ముందు ప్రచారాన్ని ఆపాల్సి ఉండడంతో ఆ గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. వారం రోజులుగా నామినేషన్లు, ప్రచారాలతో సందడి నెలకొన్న గ్రామాల్లో మంగళవారం సాయంత్రంతో బ్రేక్‌పడనుంది. ఇక, పోలింగ్‌కు అధికారులు అంతా సిద్ధం చేశారు. మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్‌న్ సెంటర్లను ఏర్పాటు చేసి.. పోలింగ్ సామగ్రిని పంపించారు. పోలింగ్ సిబ్బందికి కూడా రెండు విడతల్లో శిక్షణ పూర్తి చేశారు.
159 పంచాయతీల్లో ఎన్నికలు
సూర్యాపేట జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత తుంగతుర్తి, మద్దిరాల, నాగారం, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామ పంచాయతీలు, 1,442 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీనికోసం గత నెల 27న నోటిఫికేషనన్ విడుదలైన నాటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నవంబర్ 29తో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నవంబర్ 30న స్క్రూట్నీ నిర్వహించి డిసెంబరు 1న అప్పీల్‌కు అవకాశం ఇచ్చారు. 2న వాటిని పరిష్కరించి.. 3వ తేదీన 3 గంటల వరకు ఉపసంహరణలు కొనసాగాయి. ఆ తర్వాత రంగంలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించి గుర్తులు కేటాయించారు.
10వ తేదీన పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది..
11న మొదటి విడత పోలింగ్ జరగనున్నందున.. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్‌న్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరుకుంది. పోలింగ్ బాక్సులు కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్నాయి. 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి డిస్ట్రిబ్యూషనన్ కేంద్రాల వద్ద నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకుని పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత అదేరోజు 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇలా మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.
11న ఎనిమిది మండలాల్లో పోలింగ్
మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్
సెంటర్లకు చేరిన పోలింగ్ సామగ్రి
సిబ్బందికి రెండు విడతల్లో శిక్షణ పూర్తి
10వ తేదీన పోలింగ్ కేంద్రాలకు
తరలనున్న సిబ్బంది


