పక్కా వ్యూహం.. గెలుపే లక్ష్యం
భానుపురి (సూర్యాపేట) : పల్లె రాజకీయం మరింత వేడెక్కింది. పార్టీలతో సంబంధం లేకున్నా పంచాయతీ సమరంలో విజయమే లక్ష్యంగా వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పక్కా ప్రణాళికతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ఉదయం గుర్తులతో ప్రచారం చేయడంతో పాటు సాయంత్రం విందులు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. ప్రధానంగా ఈనెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న మండలాల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నువ్వానేనా అన్నట్లుగా అభ్యర్థులు ఖర్చుకు వెనకాడకుండా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.
ఉదయం పూట ప్రచారం..
మొదటి విడత ఎన్నికలు జరగనున్న 159 గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డుసభ్యులకు పోటీ చేసిన అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఉదయం పూట ఇంటింటికీ తిరిగి ఎన్నికల సంఘం తమకు కేటాయించిన గుర్తులపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకేసారి పెద్దఎత్తున మద్దతుదారులతో కలిసి ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒక్కో గ్రామంలో ఉన్న వార్డులను విభజించి రోజుకు నాలుగైదు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు.
రాత్రికి పసందైన విందులు
రెండు రోజులుగా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఉదయం ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థులు రాత్రికి ఇంటింటికీ మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా సామాజిక వర్గాలు, ప్రాంతాల్లో ఉన్న తమ వార్డు ప్రజలను ఏకం చేస్తూ పసందైన మందుతో విందులు ఇస్తున్నారు. అక్కడక్కడ మద్యమే కాకుండా ఇంటింటికీ అరకిలో చికెన్ పంపిస్తూ వినూత్నంగా ఓటర్ల మనసును గెలుచుకునే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎత్తుగడలు
ఉదయం పూట ప్రచారం
ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా
రాత్రికి విందులు
మొదటి విడతలో జోరుగా
మద్యం పంపిణీ
ప్రత్యేక వాహనాలు పంపించి..
ఎన్నికలకు రెండురోజులే సమయం ఉండడంతో అభ్యర్థులు వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానున్న నేపథ్యంలో గ్రామంలోని వివిధ వార్డులకు చెందిన ప్రజలు హైదరాబాద్, ఖమ్మం, చైన్నె, ఇలా నగరాల్లో ఉన్న వారికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొదటి విడతలో ఈనెల 11న పోలింగ్ ఉండడంతో ఆయా మండలాలకు చెందిన ఓటర్లు ఈనెల 10నే సొంత గ్రామాలకు చేరేందుకు కావాల్సిన ఏర్పాట్లను అభ్యర్థులు చేస్తున్నారు. కొందరు రవాణాకు కావాల్సిన డబ్బులను పంపిస్తుండగా.. మరికొందరు పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్న చోటకు ప్రత్యేక వాహనాలను సైతం పంపించేలా చూస్తున్నారు.


