స్కూల్‌లో ఫర్నిచర్ ఉందా!
నాగారం : పాఠశాలలో అవసరానికి మించి బెంచీలు, ఫర్నిచర్ ఉంటే.. అవసరం ఉన్న పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం పంపించండి.. ఇది రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలు. 2024–25 యూడైస్ గణాంకాలను పరిశీలిస్తే కొన్ని పాఠశాలల్లో ప్రస్తుత విద్యార్థుల సంఖ్యకు అదనంగా డ్యూయల్ డెస్కు లు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. కొన్ని పాఠశాలల్లో బెంచీలు లేక విద్యార్థులు నేలపైనే కూర్చోవాల్సి వస్తోంది. దీంతో ఫర్నిచర్ విషయంలో సర్దుబాటు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఎన్ని పాఠశాలల్లో మిగులు డ్యూయల్ డెస్క్‌లు ఉన్నాయి.. ఎన్ని అవసరం అనే విషయాలను గుర్తించే పనిలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు.
జిల్లాలో ఇలా...
జిల్లాలోని కొన్ని పాఠశాలలకు పూర్వ విద్యార్థులు, దాతలు తమ కుటుంబ సభ్యుల పేరిట బెంచీలు, కుర్చీలు తదితర సామగ్రిని అందజేశారు. బెంచీలు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలు కూడా ఉన్నాయి. గతంలో మన ఊరు–మన బడి పథకం ద్వారా కొన్ని పాఠశాలలకు డ్యూయల్ డెస్కులు కూడా పంపిణీ చేశారు. ఈ విద్యాసంవత్సరంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట నిర్వహించినా ఆశించిన విధంగా విద్యార్థులు చేరలేదు. అలాంటి పాఠశాలల్లో ఫర్నిచర్ మిగులుగా ఉంది.
వివరాలు ఇలా పంపాలి..
ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలకు దాతలు లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించిన ఫర్నిచర్ వివరాలను పరిశీలించాలి. మిగులు ఫర్నిచర్ ఉంటే ఆ వివరాలను ఎంఈఓకు తెలియజేయాలి. వారు పరిశీలించి ఆ వివరాలను డీఈఓకు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 15 వరకు నివేదికను విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు పంపించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశం
లెక్కలు తేల్చే పనిలో అధికారులు
అదనంగా ఉంటే ఫర్నిచర్ కొతర
ఉన్నబడికి పంపించేలా ప్రణాళిక
15 వరకు ఉన్నతాధికారులకు నివేదిక


