నిబంధనల మేరకు ప్రచారం చేసుకోవాలి
పెన్‌పహాడ్ : సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నిబంధనల మేరకు ప్రచారం చేసుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని రైతువేదిక కార్యాలయంలో సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల నియమావళి, వ్యయం, ప్రచారం, సమయపాలన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పరిమితికి మంచి ఖర్చు పెట్టవద్దని ప్రతి విషయాన్ని పరిశీలకులు గమనిస్తూ ఉంటారన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, మద్యం డబ్బు, ఉచితాలు, బహుమతులు లాంటి వాటిపై పోలీసు నిఘా ఉందన్నారు. సమయపాలన ముఖ్యమని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల బరిలో అంతా సొంత ఊరు వారే ఉంటారు కాబట్టి వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని ప్రచారం సమయంలో ఒకరినొకరు ఎదురుపడే సమయంలో గొడవలు పెట్టుకోవద్దన్నారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. బాణాసంచా పేల్చ డం, డీజేలు ఉపయోగించడం నిషిద్ధమని స్పష్టం చేశారు. సమస్యలు సృష్టించే వారిని ముందస్తుగా బైండోవర్ చేశామని బైండోవర్ అనేది కేసు కాదు అది వ్యక్తిగత సత్ప్రవర్తన కోసం స్వతహాగా ఇచ్చే హామీ పత్రమని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, తహసీల్దార్ లాలు, ఎంపీడీఓ జానయ్య, ఎస్‌ఐ గోపికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
నియమావళి పాటించాలి
మునగాల: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నియమావళి పాటించాలని జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. సోమవారం రాత్రి మునగాల మండలం కలకోవలో ఎన్నికల నిబంధనలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రతి గ్రామం శాంతి కోవెలగా వెలగాలని, ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి సామరస్యంగా ఉండాలని సూచించారు. సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ చేస్తామన్నారు. గ్రామం నుంచి ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావాలని, దీనికోసం భవిష్యత్‌లో కలకోవ గ్రామంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఈ సదస్సులో కోదాడ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరెడ్డి, మునగాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.రామకృష్ణారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, మునగాల, నడిగూడెం, మోతె ఎస్‌ఐలు బి.ప్రవీణ్‌కుమార్, అజయ్‌కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ నరసింహ


