ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌తో కలిసి నిర్వహించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం, నాగారం, నూతనకల్, మద్దిరాల, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లోని సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సిబ్బందికి పోలింగ్ విధులను కేటాయించారు. జిల్లాలో మొదటి విడతలో 159 సర్పంచ్, 1,442 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ సిబ్బంది కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులు 1,683, ఓపీఓలు 2,260 పోలింగ్ కోసం ర్యాండమైజేషన్ జరిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జెడ్పీ సీఈఓ వీవీ.అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్‌పీఓ నారాయణరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ఎన్నికల సాధారణ
పరిశీలకుడు రవినాయక్


