తప్పుల తడకగా జాబితా
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో పంచాయతీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది జాబితా సవరణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. గతంలో ఉన్న ఓటర్ జాబితాలోనే కొత్తగా నమోదైన ఓటర్లను జతచేసి.. అస్తవ్యస్తంగా జాబితా తయారు చేశారు. రెండు, మూడేళ్ల క్రితం మృతిచెందిన వ్యక్తుల పేర్లు ఓటర్ జాబితాలో ఉండడం చూస్తుంటే అధికారుల పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు పలుమార్లు అవకాశం కల్పించినా.. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లాలో మొత్తం 6,94,815 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 3,54,050 మంది, పురుషులు 3,40,743 మంది.
సవరణలకు అవకాశం ఇచ్చినా..
గతేడాది ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు 2024 సెప్టెంబర్ నుంచే ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. ఇందుకోసం జిల్లా అధికారులతో ఓటర్ల జాబితా రూపొందించింది. ఆ సమయంలో 2024 అసెంబ్లీ ఎన్నికలనాటి ఓటర్ జాబితా ఆధారంగా ముసాయిదా జాబితా రూపొందించి.. అక్టోబర్ 1వ తేదీన తుది జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 6,82,882 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 3,47,320 మంది, పురుషులు 3,35,542 మందిగా అధికారులు ప్రకటించారు. పలు కారణాలతో ఎన్నికలు వాయిదా పడగా.. 2025 జూన్ నుంచి కసరత్తు చేస్తూ సెప్టెంబర్‌లో పంచాయతీ ఓటర్ల తుది జాబితాను మరోసారి ప్రకటించింది. మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చినా బీఎల్‌ఓలు ఎక్కడా ఇంటింటికి తిరిగిన పాపాన పోలేదు. గతంలో ఉన్న జాబితానే ముందు ఉంచి ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పించారు. దీంతో పల్లె ఓటర్ల సంఖ్య 6,94,815 మందికి చేరింది.
అందరి ఓట్లు ఒకేచోట ఉండాలని సూచించినా..
2019 పంచాయతీ ఎన్నికల సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఓట్లు ఒక్కొక్కరివి ఒక్కో వార్డులో నమోదై ఉన్నాయి. దీంతో ఓటర్లు ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో గతంలో మాదిరిగా ఇబ్బందులు తలెత్తకుండా ఇంటింటికీ బీఎల్‌ఓలు తిరిగి కుటుంబంలోని ఓట్లన్నీ ఒకేవార్డులో ఉండేలా చూడాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినా జిల్లాలో అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో తూతూమంత్రంగానే బీఎల్‌ఓలు ఈ ప్రక్రియను చేపట్టారు. కుటుంబంలో మూడు ఓట్లు ఉంటే.. రెండు ఓట్లు ఓ వార్డులో, ఇంకో ఓటు మరో వార్డులో ఉన్నాయి.
● తుంగతుర్తి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు కొత్తగూడెం గ్రామంలో ఒకే కుటుంబ సభ్యులు వేరువేరు వార్డుల్లో ఉన్నారు. కొత్తగూడెంలో గొల్లపల్లి లక్ష్మయ్య కుటుంబంలో ముగ్గురు ఓటర్లు ఉండగా.. తల్లి కొడుకుది మూడో వార్డులో ఓటు ఉంది. తండ్రి లక్ష్మయ్య ఓటు ఒకటో వార్డులో ఉంది. ఇలా అనేక తప్పిదాలతో అస్తవ్యస్తంగా జాబితా ఉంది.
● చిలుకూరు మండలంలోని జానకీనగర్ గ్రామంలో ఒక మహిళకు రెండు ఓట్లు ఉన్నాయి. ఒకే మహిళకు ఇంటి పేరు, భర్త పేరు మార్చారు. అదే మహిళను గుర్తు పట్టకుండా ఒకటి కలర్ ఫొటో, మరొకటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోగా మార్చారు. గ్రామానికి చెందిన 6వ వార్డులో 514, 518 నంబర్లలో ఒకే మహిళకు రెండు ఓట్లు వచ్చాయి.
● చిలుకూరులో గుండు పద్మ, గుండు రామయ్య వీరిద్దరికి సంబంధించి గుండు పద్మ ఫొటోనే ఉంది. చిలుకూరు మండలం నారాయణపురంలో కొంద ఉదయ్‌కిరణ్‌కు రెండు ఓట్లు వచ్చాయి.
ఫ చనిపోయిన వారి పేర్లు
ఓటరు జాబితాలోనే..
ఫ భర్తది ఓ వార్డు, భార్యది
మరో వార్డులో ఓటు
ఫ ఎన్నిమార్లు సవరణలకు
అవకాశమిచ్చినా అంతే..
ఫ పంచాయతీ ఎన్నికల్లో
ఓటర్లకు తిప్పలే
ఈ ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తి పేరు గుద్దేటి మల్లారెడ్డి. ఇతడిది ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రం. ఏడాది క్రితమే మల్లారెడ్డి మృతి చెందాడు. కానీ పంచాయతీ ఎన్నికల తుది ఓటరు జాబితాలో గ్రామంలోని 8వ వార్డులో ఇతడి పేరు ఉంది. ఈ ఏడాది రెండుమూడుసార్లు ఓటరు జాబితా సవరణకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చినా.. మల్లారెడ్డి పేరును తొలగించకపోవడం క్షేత్రస్థాయి అధికారుల పనితీరుకు నిదర్శనం.
గ్రామపంచాయతీలు : 486
వార్డులు : 4,332
ఓటర్లు : 6,94,815
మహిళలు : 3,54,050
పురుషులు : 3,40,743
తప్పుల తడకగా జాబితా


