రెండోరోజు సర్పంచ్‌కు 203, వార్డులకు 605 నామినేషన్లు
భానుపురి (సూర్యాపేట) : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు రెండో రోజు గురువారం భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని 146 గ్రామపంచాయతీలు, 1,318 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు సర్పంచ్ పదవికి 105 వార్డు మెంబర్ పదవికి 110 నామినేషన్లు వచ్చాయి. రెండో రోజు సర్పంచ్ కు 203, వార్డ్ మెంబర్ కు 605 నామినేషన్లు దాఖలు అయ్యాయి. సర్పంచ్ పదవికి హుజూర్‌నగర్‌లో 21, నేరేడుచర్లలో 15, మేళ్లచెరువులో 18, మఠంపల్లిలో 35, గరిడేపల్లి లో 53, పాలకవీడులో 36, చింతలపాలెం లో 25 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యులకు హుజూర్‌నగర్‌లో 124, నేరేడుచర్ల లో 52, మేళ్లచెరువులో 46, మఠంపల్లిలో 59, గరిడేపల్లి లో 141, పాలకీడులో 96, చింతలపాలెం లో 87 చొప్పున నామినేషన్లు అధికారులకు అందాయి. శుక్రవారం చివరి రోజు భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది.
ముమ్మరంగా
వాహనాల తనిఖీ
మోతె : మోతె మండలంలో హైదరాబాద్–ఖమ్మం జాతీయ రహదారిపై సింగరేణిపల్లె టోల్‌గేట్ వద్ద గురువారం జిల్లా వ్యయ పరిశీలకుడు బి.హుస్సేన్ వాహనాల తనిఖీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బాధ్యతాయుతంగా వాహనాల తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. వాహనాల్లో లెక్క చూపని డబ్బు మద్యం సరఫరా చేస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీలు పకడ్బందీగా చేయాలని సూచించారు. సహాయ వ్యయ పరిశీలన టీంకు ఎన్నికల విధులపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కర్ణాకర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా బాలుర కబడ్డీ
జట్టు ఎంపిక
కోదాడ: మహబూబ్‌నగర్‌లో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు జరిగే తెలంగాణ రాష్ట్ర 51వ జూనియర్ కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొనే బాలుర జట్టును గురువారం కోదాడలోని కేఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎంపిక చేసినట్టు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఒక ప్రకటనలో తెలిపారు. కెప్టెన్‌గా బి.సైదులు, సభ్యులుగా బి.నరసింహ, కె.నరేందర్, బి.సాయి, యాకస్వామి, ఎస్‌కె.యాసీన్, వై.సాయిగౌతమ్, జావీద్, తేజేష్, భరత్‌చంద్ర, చంద్రహరి, ఇమ్రాన్, చందు, ధీరజ్, స్టాండ్‌బైలుగా గౌతమ్, కోటేష్‌ను ఎంపిక చేశామని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు
వేగవంతం చేయాలి
మోతె : పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేగవంతం చేయాలని డీసీఓ ప్రవీణ్ అన్నారు. గురువారం మోతె మండల పరిధిలోని సిరికొండ, రాఘవాపురం, ఉర్లుగొండ గ్రామాల్లో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు 11,875 మంది రైతుల నుంచి 77,294 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో 56,414 మెట్రిక్ టన్నులకు సంబంధించి 8,645 మంది రైతులకు రూ.134 కోట్లు వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేశామని అన్నారు.
రెండోరోజు సర్పంచ్‌కు 203, వార్డులకు 605 నామినేషన్లు


