పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి
భానుపురి (సూర్యాపేట) : పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఫెసిలిటేషన్ సెంటర్‌లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. జిల్లాలకు కేటాయించిన ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, పంచాయతీరాజ్, పోలీస్ అధికారులతో గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే.నరసింహతో కలిసి రవినాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజ్ 2, జోనల్ అధికారులకు శిక్షణ, సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లాల వారీగా సమీక్షించారు. అనంతరం జిల్లా అధికారులతో రవినాయక్ మాట్లాడారు.
ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్లు..
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ మొదటి విడత జరిగే 8 మండలాల్లో డిసెంబర్ 6 నుంచి 9 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రెండో విడత జరిగే 8 మండలాల్లో డిసెంబర్ 7 నుంచి 10 వరకు, మూడో విడత జరిగే 7 మండలాల్లో డిసెంబర్ 10, 12, 13, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశామని వివరించారు. ఒకే గ్రామ రెండు ప్రాంతాల్లో పోలింగ్ జరిగితే పోలీస్ బందోబస్తు మధ్య ఒకే ప్రాంతానికి బ్యాలెట్ బాక్స్‌లను తరలించి ఓట్లు లెక్కింపు చేయాలని సూచించారు. అదనపు ఎస్పీ ప్రసన్నకుమార్, జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్‌పీఓ నారాయణరెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ఎన్నికల సాధారణ
పరిశీలకుడు రవినాయక్


