ప్రలోభాలకు గురిచేయవద్దు
భానుపురి (సూర్యాపేట) : అభ్యర్థులను నామినేషన్ ఉపసంహరణలో ఎలాంటి ఒత్తిడికి, ప్రలోభాలకు గురి చేయవద్దని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. పంచాయతీ ఎన్నికలపై బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మొదటి విడత కింద నిర్వహించనున్న 8 మండలాల్లోని గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి బుధవారంతో ఉపసంహరణ పూర్తి అయ్యిందన్నారు. సర్వీస్ ఓటర్లకు, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అధికారులకు, సపోర్టింగ్ స్టాఫ్‌కు, ఎన్నికల్లో ఉపయోగించే వాహన డ్రైవర్లకు ఫారం 14 ద్వారా పోస్టల్ బ్యాలెట్ జారీ చేయాలని సూచించారు. వారి ఓటు ఉన్న సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
పారదర్శకంగా నిర్వహించాలి
పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రక్రియ సాఫీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. ప్రతిరోజు ఉదయం స్ట్రాంగ్ రూమ్ నుంచి పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌కు పోలీస్ బందోబస్త్‌తో తీసుకెళ్లాలని, అక్కడ గ్రామపంచాయతీల వారీగా బ్యాలెట్ బాక్స్‌లను ఏర్పాటు చేసి అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయాలన్నారు. తిరిగి సాయంత్రం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌కు పోలీస్ ఎస్కార్ట్‌తో తరలించి భద్రపర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీకె.నరసింహ, అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జెడ్పీ సీఈఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి శ్రీనివాస్, డీఎల్‌పీఓ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


