ప్రజలు కోరుకునే ప్రజాస్వామ్యం తీసుకొస్తాం
సూర్యాపేట: రాష్ట్రంలో ప్రజలు కోరుకునే ప్రజాస్వామ్య పరిపాలనను తీసుకొస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. రాబోయే రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, బీసీ వర్గాల అభివృద్ధికి పార్టీ తీసుకోబోయే కార్యాచరణను ప్రకటించారు. అనేక మంది మేధావుల ఆలోచన నుంచి పుట్టిన ఈ పార్టీ అగ్రకులాలకు వ్యతిరేకంగా స్థాపించామన్నారు. 42శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటిస్తే తెల్లారే వారు ఇవ్వరని చెప్పానని, ప్రస్తుతం అదే జరిగిందన్నారు. 2028లో రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడబోతుందని జోష్యం చెప్పారు. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జి వట్టె జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న


