ఆత్మవిశ్వాసం పెంచేలా చెలిమి
బాలలకు ఎంతో మేలు
నాగారం : నేటి డిజిటల్ ప్రపంచంలో విద్యార్థులు అతి సున్నిత మనస్కులుగా తయారవుతున్నారు. చిన్న, చిన్న సమస్యలకే పెద్ద నిర్ణయాలు తీసుకొంటూ తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్చుతున్నారు. దీనికి కారణం అతి గారాబం, సామాజిక మాధ్యమాల ప్రభావం. విద్యాపరమైన ఒత్తిళ్లేనని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆదిలోనే గుర్తించి, సరైన అవగాహన కల్పిస్తే మార్పు వస్తుందని కేంద్ర విద్యా శాఖ గుర్తించింది. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం బడుల్లోని విద్యార్థుల్లో భావోద్వేగ స్థిరత్వాన్ని పెంచి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు చెలిమి (సోషియో ఎమోషనల్ వెల్ బీయింగ్ ప్రోగ్రామ్) అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీని ద్వారా జిల్లాలో 31 పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు మేలు కలుగుతుంది.
పాఠశాలకో ఉపాధ్యాయుడి ఎంపిక
ప్రతి పీఎంశ్రీ పాఠశాలకు ఒక నోడల్ ఉపాధ్యాయుడిని ఎంపిక చేశారు. వీరికి మనస్తత్వం, ప్రవర్తన, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై రాష్ట్రస్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అక్కడ నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులకు నేర్పించాలి. అంతా కలిసి విద్యార్థుల్లో భావోద్వేగాల (కోపం, భయం, బాధ) నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. సమస్యలను అర్థం చేసుకుని సున్నితంగా పరిష్కరించాలి. పిల్ల లకు ఎదురయ్యే అవరోధాలను అధిగమించేలా వారికి ధైర్యాన్నిస్తారు.
కలిగే ప్రయోజనాలు..
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మానసిక పరివర్తనే కీలకం. ఇది లోపిస్తే భవిష్యత్తు మొత్తం అంధకారమవుతుంది. నిత్యం చోటుచేసుకుంటున్న ఘటనలతో అప్రమత్తమై కేంద్ర విద్యా శాఖ చేపడుతున్న చెలిమి కార్యక్రమం బాలలకు ఎంతో మేలు చేయనుంది. కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా సమాజంలో వినమ్రతతో, గౌరవంగా మసలుకునేలా బాలలను తీర్చిదిద్దనున్నారు.
విడతల వారీగా...
జిల్లాలో పీఎంశ్రీ పథకానికి 31 పాఠశాలలు ఎంపికయ్యాయి. నోడల్ ఉపాధ్యాయులకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీఐఆర్డీ)లో 4 విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి 4వ విడతతో ఎంపికై న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ నెల 15 నుంచి 17 తేదీల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మానసిక పరివర్తనే కీలకం. దీనిని అధిగమించేందుకు విద్యా శాఖ చేపడుతున్న చెలిమి కార్యక్రమం బాలలకు ఎంతో మేలు చేయనుంది. జిల్లాకు చెందిన పీఎంశ్రీ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈనెల 15 నుంచి 17 వరకు శిక్షణ ఇస్తారు.
– అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి
ఫ పిల్లల్లో భావోద్వేగాల నియంత్రణకు నూతన కార్యక్రమం
ఫ పీఎంశ్రీ స్కూళ్లలో అమలుకు కేంద్రం శ్రీకారం
ఫ జిల్లాలో 31 పీఎంశ్రీ పాఠశాలలు


