ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం చివ్వెంలతోపాటు మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో చేపట్టిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, పోలీస్ బందోబస్తును ఆయన పరిశీలించారు. అనంతరం ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రతి పౌరుడు ఎన్నికల నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని, గ్రామంలో ప్రజలు అందరూ కలిసి మెలిసి ఉండాలని, పోలీస్, ఎన్నికల సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. సమస్యలు సృష్టిస్తున్న వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బైండోవర్‌ను అతిక్రమిస్తే వారి పూచీకత్తు నగదును రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఓటు హక్కును స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థులు.. ప్రజల మనసును చూరగొనాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


