బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
భానుపురి (సూర్యాపేట) : గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా, బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫేస్–2 రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పలు సూచనలు చేసి మాట్లాడారు. అభ్యర్థి రోజూ వారి ఎన్నికల ఖర్చు వివరాలను తనిఖీ చేయడం, వివరాలు ఇవ్వడంలో విఫలమైతే వారికి నోటీసులు జారీ చేసే అధికారం, మండల కేంద్రం నుంచి పోలింగ్ మెటీరియల్‌ను పోలింగ్ కేంద్రానికి, పీఓకు అందించడంలో ఆర్‌ఓల పాత్ర కీలక అని అన్నారు. గ్రామపంచాయతీలో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఇతర ఏర్పాట్లు పరిశీలించాలని, ఓటర్లకు బీఎల్‌ఓ ద్వారా ఫొటో ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందిని పోలింగ్ స్టేషన్‌కు పంపించడం, సామగ్రి సరఫరా, పోలింగ్‌ను సమర్థంగా పర్యవేక్షించడం, ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాలని, పోలింగ్ జరిగేటప్పుడు ఏదైనా అనుకోని సమస్య ఎదురైతే వాటిని పరిష్కరించాలన్నారు. కౌంటింగ్ ప్రదేశం, పోలీస్ సిబ్బంది, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు, ఫలితాలు ప్రకటించడం, ఉప సర్పంచ్ ఎన్నిక, ధ్రువపత్రాల పంపిణీ, వ్యయాన్ని పర్యవేక్షించటం, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ తదితర విధులు రిటర్నింగ్ ఆఫీసర్లు సమర్థంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీపీఓ యాదగిరి, డీఆర్‌డీఏ పీడీ అప్పారావు, డీఎఫ్‌ఓ సతీష్, ట్రైనర్లు రమేష్, వెంకటేశ్వర్లు,రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


