యువత.. పెడదారి
భవిష్యత్‌ను ఆగం చేసుకోవద్దు
హత్యకేసులు, నిందితుల వయసు వివరాలు
సూర్యాపేటటౌన్ : యువతం అంటేనే సమాజానికి దిక్సూచిలా ఉండాల్సిన బాధ్యత. కానీ ప్రస్తుతం కొంత మంది యువకులు పెడదారిపడుతున్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్‌లాంటి మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. జల్సాలకు అలవాటుపడి , ఈజీమనీ కోసం మత్తులోనే హత్యలు, చోరీలకు పాల్పడుతున్నారు. తెలిసీతెలియని వయస్సులో క్షణికావేశంలో ఎంతటికై నా తెగిస్తున్నారు. నేరాలు చేస్తూ జైలుపాలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల కలలను కల్లలు చేస్తున్నారు.
తల్లిదండ్రులు దృష్టి సారిస్తే మేలు..
తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై దృష్టి సారించకపోవడంతోనే చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, ఎవరి జీవన విధానంలో వారు బిజీగా ఉండి పిల్లలను పట్టించుకోవడం లేదు. దీంతో పిల్లలు యుక్త వయస్సులోనే చెడిపోతున్నారు. పిల్లల కదలికలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కని పెడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కళాశాలకు వెళ్తున్నారా.. స్నేహితులు ఎవరు.. ఎలాంటి వారు.. వారి కుటుంబ వివరాలు తెలుసుకుంటేనే మేలు. పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కళాశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులతో తరచూ పిల్లల చదువుపై చర్చిస్తూ ఉండాలి. జల్సాలకు పోవద్దని, డబ్బు పొదుపుగా వాడుకోవాలని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. తెలిసో, తెలియకో నేరాలకు పాల్పడితే భవిష్యత్ ఏమవుతుందో, ఎటువంటి శిక్షలు ఉంటాయో వారికి అవగాహన కల్పించాలి.
మత్తుకు బానిసై నేరాలు..
ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్, మద్యం ప్రభావం యువత పై ఎక్కువగా చూపిస్తుంది. ఇటీవల గంజాయి కేసులలో పట్టుబడిన వారిలో ఎక్కువగా జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో ఇతర ప్రాంతల నుంచి గంజాయి తీసుకొచ్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోపక్క ఈజీ మని కోసం మర్డర్లు చేసేందుకు వెనుకాడడం లేదు. జిల్లాలో ఇప్పుడు చాలా మంది యువత గంజాయి మత్తులో తమ భవిష్యత్ నాశనం చేసుకుంటోంది. ఇటీవల జరిగిన హత్య కేసుల్లో చూస్తే మత్తులో పడి, ఈజీ మని కోసం చేసినవే ఎక్కువగా ఉంటున్నాయి.
ఫ మద్యం, గంజాయి, డ్రగ్స్‌కు బానిస
ఫ జల్సాలు, ఈజీమనీ కోసం నేరాలబాట
ఫ ఇటీవల హత్య కేసుల్లో
30ఏళ్ల లోపు వారే అధికం
ఫ పిల్లలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలంటున్న పోలీసులు
చదువుకొని భవిష్యత్‌ను బంగారు మయం చేసుకోవాల్సిన చాలా మంది యువకులు జల్సాలకు అలవాటుపడి చెడు మార్గంలో పయనిస్తున్నారు. హత్యలు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఇలా జీవితాలను ఆగం చేసుకోవద్దు. మంచి,చెడుల గురించి పిల్లలకు వివరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ప్రతి యువకుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. చట్టాలు, శిక్షలు వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి పోలీసు శాఖ తరఫున పోలీస్ ప్రజా భరోసా సైతం నిర్వహిస్తున్నాం. – నరసింహ, ఎస్పీ
ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ కాలనీ సమీపంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. అయితే ఈ కేసులో 10 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందులో ఆరుగురు 35 ఏళ్ల లోపు వారే. వీరంతా జల్సాలకు, ఈజీమనీకి అలవాటు పడి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
గతనెల ఆత్మకూర్(ఎస్)మండలంలోని ఒక గ్రామంలో ఓ వ్యక్తి తన ఇద్దరు కొడుకులతో పాటు మరికొందరితో కలిసి భార్యను హత్య చేశాడు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేస్తే వీరిలో 25 ఏళ్ల లోపు యువకులు ముగ్గురు, 30 సంవత్సరాలలోపు వారు ఇద్దరు, 50 ఏళ్ల వయస్సు వారు ఒకరు ఉన్నారు. ఇలాంటివి జిల్లాలో జరిగిన మరెన్నో సంఘటనల్లో అత్యధికంగా యువకులే ఉండటం గమనార్హం.
సంవత్సరం 2024 2025(ఇప్పటి వరకు)
నమోదైన హత్య కేసులు 20 13
అరెస్ట్ అయిన నిందితులు 55 86
30ఏళ్ల లోపువారి సంఖ్య 16 36(వీరిలో ఒకరు మైనర్)
40 ఏళ్లలోపు వారు 14 27
40 ఏళ్లుపైబడిన వారు 25 23


