నేటి నుంచి జోనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జోనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌

Nov 6 2025 7:28 AM | Updated on Nov 6 2025 7:28 AM

నేటి నుంచి జోనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌

నేటి నుంచి జోనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌

నడిగూడెం : నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 6,7,8 తేదీలలో జోనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించనున్నట్లు డీసీఓ పద్మ తెలిపారు. బుధవారం నడిగూడెంలో క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం ఆమె స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. ఈ క్రీడా పోటీల్లో సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన 9 బాలికల గురుకుల పాఠశాలలకు చెందిన 765 మంది క్రీడాకారులు హాజరు కానున్నట్లు ఆమె పేర్కొన్నారు. గురువారం జరిగే ప్రారంభ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి హాజరు కానున్నట్లు తెలిపారు. ఆమె వెంట స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌.వాణి ఉన్నారు.

గోదావరి జలాల నిలిపివేత

అర్వపల్లి: గోదావరి జలాలను నిలిపివేశారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి 50రోజుల పాటు నిరంతరాయంగా జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేశారు. కాగా భారీ వర్షాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండి గేట్లు ఎత్తడంతో మళ్లీ అదనంగా నీటిని ఈనెల 2న వదిలారు. ప్రస్తుతం రైతులకు నీటి అవసరం లేక పోవడంతో నిలిపివేశారు.

మూసీకి

కొనసాగుతున్న వరద

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు మూసీకి 3,936 క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రాజెక్టు మూడు క్రస్ట్‌గేట్లను పైకెత్తి 3,870 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 23 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 645 (4.46 టీఎంసీలు) అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో 643.50 (4.07 టీఎంసీలు) అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిలకడగా ఉంచి ఎగువ నుంచి వచ్చే నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

పెండింగ్‌ డీఏలు చెల్లించాలి

సూర్యాపేట : ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌ డీఏలు, ఇతర బిల్లులను వెంటనే విడుదల చేయాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం ఆత్మకూర్‌(ఎస్‌)లో నిర్వహించిన మండల కమిటీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా పబ్బతి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్‌ యోగానందచారి వ్యవహరించారు.

వైభవంగా సుదర్శన హోమం

సూర్యాపేట : కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గిరిదుర్గంలో గల శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో బుధవారం సుదర్శన హోమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీకరచార్యులు, కృష్ణమాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కృష్ణకుమార్‌, మురళీకృష్ణ, డాక్టర్‌ రామయ్య, శంకరాచారి, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement