జాతీయ సమైక్యతకు సర్దార్ @ 150 యూనిటీ మార్చ్
సూర్యాపేట : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రజల్లో జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్, ఎన్‌ఎస్‌ఎస్ సహకారంతో సర్దార్ @ 150 యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు కేసరి దేవ్‌సిన్హా జ్వాల తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి సూర్యాపేట, నల్లగొండ జిల్లాల అధికారులు, మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫెరెన్స్‌లో మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమానికి తాను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా నియమితులైనట్లు చెప్పారు. జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 31 నుంచి నవంబర్ 25 వరకు జిల్లాలో విడతలవారీగా కార్యక్రమాలు ఉంటాయన్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో నవంబర్ 12, 13 తేదీల్లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్ర 8 నుంచి 10 కిలోమీటర్లు ఉండేలా చూడాలని, ఇందులో కనీసం 500 మంది యువత, విద్యార్థులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్‌లో ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా క్రీడల అధికారి వెంకట్ రెడ్డి, యూత్ అధికారి రాజేష్, జెడ్పీ సీఈఓ అప్పారావు, విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇంటర్ విద్యాధికారి భాను నాయక్, డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు కేసరి దేవ్‌సిన్హాజ్వాల


