రాజ్యాంగంపై దాడిగా పరిగణించాలి
చివ్వెంల: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడిని రాజ్యాంగంపై దాడిగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజేఐపై సనాతన ధర్మం పేరుతో దాడి చేయడం అమానుషమని అన్నారు. ఇటువంటి దాడి చట్టపరిధిలోకి రాదా అని ప్రశ్నించారు. ఈ దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి కానీ ఏ ఒక్కరూ నిరసన కార్యక్రమం చేపట్టలేదన్నారు. చట్ట ప్రకారం ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయాలని కానీ ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం చాలా విచారకరమన్నారు. దాడిని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. జస్టిస్ గవాయ్‌పై దాడిని నిరసిస్తూ నవంబర్ 1న హైదరాబాద్‌లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపెల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, జీపీ ఫరీదుద్దీన్, ఏజీపీ షఫిఉల్లా, నూకల సుదర్శన్‌రెడ్డి, వసంత సత్యనారాయణఫిళ్లె, డపుకు మల్లయ్య, దావుల వీరప్రసాద్, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న, రెబల్ శ్రీను, ఎర్ర వీరస్వామి పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మంద కృష్ణ మాదిగ


