యువజనోత్సవాలకు వేళాయే..
సూర్యాపేటటౌన్ : యువత కళా నైపుణ్యాలు ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. నవంబర్ 7న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యువజనోత్సవాలను నిర్వహించనున్నారు. జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ కళల్లో రాణించే యువతీయువకులకు ఇదో చక్కటి వేదిక కానుంది. ఇందులో ప్రతిభ కనబరిచే కళాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు.
అర్హులు వీరే...
జాతీయ యువజనోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లాకు చెందిన యువత మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. మూడేళ్లుగా జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొన్నవారు ఇప్పుడు జరిగే పోటీలకు అనర్హులు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారిని రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు పంపుతారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారిని జాతీయ స్థాయిలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీ లో జరిగే యువజనోత్సవాలకు పంపుతారు.
అంశాలు, నిబంధనలు..
1. జానపద నృత్యం గ్రూప్..
బృందంలో సభ్యుల సంఖ్య 10 కి మించరాదు.
ప్రదర్శనకు గరిష్ట కాలపరిమితి 15 నిమిషాలు.
భారత సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి
సినిమా పాటలను అనుమతించరు.
వాయిద్య పరికరాలు అభ్యర్థులే తెచ్చుకోవాలి.
2. జానపద పాటలు గ్రూప్...
● బృందంలో సభ్యుల సంఖ్య 10 కి మించరాదు.
● ప్రదర్శనకు గరిష్ట కాలపరిమితి 07 నిమిషాలు.
● భారత సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి.
● సినిమా పాటలు అనుమతించరు
● వాయిద్య పరికరాలు అభ్యర్థులే తెచ్చుకోవాలి.
3. కథా రచన ( హిందీ / ఇంగ్లిష్ / తెలుగు )..
● ఒక్కొక్కరు ఒక రచనను మాత్రమే సమర్పించాలి.
● వ్యాస రచన 1000 పదాల సముదాయంతో 60 నిమిషాలలో పూర్తి చేయాలి.
● ఏ కులాన్నిగానీ, ఏ మతాన్ని గానీ, జాతిని గానీ, వర్గాన్ని గానీ కించపరిచే విధంగా ఉండకూడదు.
● రచనలో అభ్యంతరకరంగా గానీ, అస్పష్టంగా గానీ లేదా అనుచిత వాక్యాలు ఉండకూడదు.
4. పెయింటింగ్..
● ఒక్కొక్కరు ఒక పెయింటింగ్ మాత్రమే సమర్పించాలి.
● ఎంట్రీ ఒరిజినల్ అయి ఉండాలి.
● పెయింటింగ్ ఏ3 సైజు , 90 నిమిషాలలో పూర్తి చేయాలి.
● పెయింటింగ్ ఏదైనా నిర్దిష్ట సంస్థకు లేదా ఏదైనా బ్రాండ్ పేరుకు ప్రాతినిధ్యం వహించకూడదు.
● పెయింటింగ్ కు సంబందించిన శీర్షిక 20–30 పదాలు మించకూడదు.
5. ఉపన్యాసం(హిందీ/ఇంగ్లిష్/తెలుగు)
● టాపిక్ : భారతదేశంలో అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్యం, ప్రజా స్వామ్య విలువలను కాపాడటం అనే అంశంపై ఏదైనా భాషలో ఏడు నిమిషాలు మించకుండా అనర్గళంగా మాట్లాడాలి.
6. కవిత్వం ( హిందీ / ఇంగ్లిష్ / తెలుగు )
● ఒక్కొక్కరు ఒక రచనను మాత్రమే సమర్పించాలి.
● వ్యాస రచన 500 పదాల సముదాయంతో 60 నిమిషాలలో పూర్తి చేయాలి.
7. ఇన్నోవేషన్ ట్రాక్(ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా)
ఇందులో పాల్గొనే వారు పర్యావరణం, వాతావరణ మార్పు, ఆరోగ్య సంక్షోభాలు వంటి ఆధునిక సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన ఆలోచన, సమస్య పరిష్కారం, ఆవిష్కరణలకు సంబంధించిన వాటిపై చేసిన ప్రయోగాలను సైన్స్ మేళాలో ప్రదర్శించాల్సి ఉంటుంది.
యువత సద్వినియోగం చేసుకోవాలి
యువ కళాకారుల్లో దాగిన ప్రతిభను వెలికి తీయడానికి ప్రభుత్వం యువజనోత్సవాలను ఏర్పాటు చేస్తోంది. ఈ వేదికను యువత సద్వినియోగం చేసుకోవాలి. ఏడు అంశాల్లో పోటీలు కొనసాగుతాయి. ప్రతి అంశానికి న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి విజేతలను రాష్ట్ర స్థాయిపోటీలకు పంపిస్తాం. – వెంకట్‌రెడ్డి, జిల్లా క్రీడల,
యువజన శాఖ అధికారి
నవంబర్ 7న సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకలు
జిల్లా స్థాయి యువజన కళాకారుల
ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
ఏడు అంశాలపై పోటీలు
వచ్చేనెల 4వ తేదీ వరకు గడువు
ఆసక్తి గల వారు పేర్లు
నమోదు చేసుకోవాలి
జిల్లా స్థాయిలో జరిగే యువజనోత్సవాల్లో పాల్గొనే యువతీయువకులు వారి వివరాలను నవంబర్ 4వ తేదీ లోపు కలెక్టరేట్‌లోని రూమ్ నంబర్ 4లోని జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో నేరుగా గానీ, సెల్ ఫోన్ నంబర్ 9490023949 ద్వారాగానీ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా క్రీడల అధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు.


