90 రోజుల ప్రణాళిక
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
ఇంటర్
విద్యార్థులకు
90 రోజుల ప్రణాళికను నవంబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం జనవరి వరకు అమలు చేయనున్నారు. రోజూ ప్రత్యేక తరగతులను సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. గతంలో వచ్చిన పరీక్షల నమూనా పత్రాలల్లోని ప్రశ్నలతో పాటు ప్రతి సబ్జెక్టు అధ్యాపకుడు పాఠాల నుంచి ముఖ్యమైన ప్రశ్నలను తయారు చేసి వాటిని విద్యార్థులతో చదివిస్తూ పరీక్షలు నిర్వహించనున్నారు.
తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వార్షిక పరీక్షల్లో వందశాతం ఫలితాలే లక్ష్యంగా ఇంటర్‌బోర్డు విద్యా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 90 రోజుల ప్రణాళిక అమలు చేయనుంది. నవంబర్ 1వ తేదీ నుంచి మూడు నెలల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
ఈసారి నెల రోజుల ముందు నుంచే
జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వీటిలో మొత్తం 3,003 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరంలో 1,559, ద్వితీయ సంవత్సరంలో 1,444 మంది ఉన్నారు. గత సంవత్సరంలో ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం వందశాతం ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో పాటు స్లిప్‌టెస్టులు నిర్వహించనున్నారు. గత సంవత్సరం డిసెంబర్ నుంచి 90 రోజుల ప్రణాళిక అమలు చేశారు. ఈసారి మాత్రం నెల రోజుల ముందు నుంచే నిర్వహించనున్నారు.
తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూపులు
ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరిలో జరగనున్న నేపథ్యంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక తరగతులపై దృష్టి పెట్టారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారు కూడా ఉత్తీర్ణత సాధించేలా చూస్తారు. కాలేజీకి సరిగా రాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, తల్లిదండ్రులతో మాట్లాడి కళాశాలకు వచ్చే విధంగా అధ్యాపకులు చర్యలు తీసుకోనున్నారు. అధ్యాపకులు సకాలంలో సిలబస్ పూర్తి చేసి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయనున్నారు. ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు. ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులకు నిర్వహించిన స్లిప్‌టెస్టుల్లో వచ్చిన మార్కులతో పాటు విద్యార్థులు కళాశాలకు హాజరైన శాతాన్ని కూడా గ్రూపుల్లో పోస్టు చేయనున్నారు. ఇంటి వద్ద విద్యార్థులు చదువుకునేలా చూడాలని వారి తల్లిదండ్రులకు సూచించనున్నారు
ఇప్పటికే అధ్యాపకులతో సమావేశాలు
90 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా ఇంటర్‌బోర్డు జాయింట్ సెక్రటరీ భీమ్‌సింగ్ జిల్లాలోని జూనియర్ కాలేజీలకు వెళ్లి అధ్యాపకులు, ప్రిన్సిపల్స్‌తో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల హాజరుశాతం పెంచడంతో పాటు మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలని అధ్యాపకులకు సూచిస్తున్నారు.
ఫ నవంబర్ 1 నుంచి ప్రత్యేక తరగతులు
ఫ రోజూ సాయంత్రం గంటపాటు నిర్వహణ
ఫ మూడు నెలల పాటు కొనసాగింపు
ఫ వందశాతం ఫలితాలే లక్ష్యం
జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడానికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. 90 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. విద్యార్థులకు స్లిప్ టెస్ట్‌లు నిర్వహించి తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధపెడతాం.
– భీమ్‌సింగ్, ఇంటర్ బోర్డు
జాయింట్ సెక్రటరీ
90 రోజుల ప్రణాళిక


