కలెక్టర్.. ఉపాధ్యాయుడిగా మారి
అర్వపల్లి: పిల్లలంటే ఆయనకు ఎంతో ఇష్టం. తన పర్యటనలో భాగంగా ఎక్కడికి వెళ్లినా పాఠశాలనో, అంగన్‌వాడీ కేంద్రాన్నో, హాస్టల్‌నో విధిగా సందర్శిస్తారు. విద్యార్థులను చూడగానే ఉపాధ్యాయుడిగా మారిపోతారు. వారితో ముచ్చటించి సామర్థ్యాలను తెలుసుకుంటారు. ఆయన సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్.
విద్యార్థుల ప్రతిభకు మెచ్చి..
జాజిరెడ్డిగూడెం మండలంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ మంగళవారం పర్యటించారు. మొదట వివిధ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. 4, 5 తరగతుల గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో ఇంగ్లిష్ చదివించి తెలుగులో అర్థాలు అడిగి తెలుసుకున్నారు. గణితంలో సంకలనం, వ్యవకలనం, గుణకారం తదితర లెక్కలను విద్యార్థులతో బోర్డుపై చేయించి సమాధానాలు రాబట్టారు. ఉపాధ్యాయుడిలా ప్రతి విద్యార్థి నోటు పుస్తకాలను తీసుకొని పరిశీలించారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ సరైన సమాధానాలు చెప్పడం, చక్కగా రాయడం ద్వారా మంచి ప్రతిభను చూపించడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సంతోషంతో విద్యార్థులకు బహుమతులనుసైతం అందజేశారు.
ఉపాధ్యాయులంటే ఇలా ఉండాలి
ఉపాధ్యాయులంటే ఇలా ఉండాలి అంటూ ఆ పాఠశాల హెచ్‌ఎం చిప్పలపల్లి ధర్మయ్య, ఉపాధ్యాయులు నీరజ, సుధారాణి, నల్లగంటి వెంకన్నలను కలెక్టర్ అభినందించారు. టీచర్ల పనితీరు విద్యార్థుల చదువులోనే కనిపిస్తోందని, ఎప్పటికీ ఇలాగే బోధించండి...మంచి పేరు తెచ్చుకోండి అని సూచించారు. ప్రతి విద్యార్థి కిందితరగతి నుంచే చదవడం, రాయడం రావాలని, అలాగే గణితం, ఇంగ్లిష్‌లాంటి సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని అప్పుడే ఉన్నత తరగతుల్లో ఆయా సబ్జెక్టులపై పూర్తి పట్టు సాధిస్తారని విద్యార్థులకు ఉద్బోధించారు. ఈ పాఠశాలలో విద్యా బోధనను చూసి సంతోషపడి వెంటనే ఉపాధ్యాయ బృందాన్ని తన దగ్గరకు పిలుచుకొని వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ‘ఇంత బాగా చదువు చెబుతున్నందున మీసమస్యలు ఏవైనా ఉంటే నాకు చెప్పండి వాటిని వెంటనే పరిష్కరిస్తాను’ అని కలెక్టర్ వారిని అడిగారు. ఏ సమస్యలు లేవని సమాధానమిచ్చారు. కాగా స్థానికులు పాఠశాల ఆవరణలోని అంగన్‌వాడీ భవనం నిధులలేమితో నిలిచిపోయిందని పనులు పూర్తి చేయించాలని కోరగా నిధుల మంజూరుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
ఫ రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలలో గంటపాటు పిల్లలతో మమేకం
ఫ ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో సామర్థ్యాల పరిశీలన
కలెక్టర్.. ఉపాధ్యాయుడిగా మారి


