ముగిసిన శ్రీరామ యజ్ఞ మహోత్సవం
హుజూర్‌నగర్ : కార్తీక మాసం సందర్భంగా నేరేడుచర్ల పట్టణంలోని శ్రీకోదండ రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామ యజ్ఞ మహోత్సవం ముగిసింది. మంగళవారం ఆలయ ప్రధాన అర్చకుడు బృందావనం శ్రీరామ నర్సింహతేజ ఆధ్వర్యంలో వేద పండితులు.. వేదమంత్రోత్సవాల మధ్య వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రపాలకుడు శ్రీఆంజనేయస్వామి, శ్రీరామ దండానికి పంచామృతాలతో అభిషేకం చేసి అరటిపండ్లతో అలంకరించారు. అనంతరం ఆలయంలోని దేవతా ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకీపై ఆలయం చూట్టు జై శ్రీరాం నినాదాలతో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన హోమ గుండంలో సంప్రదాయబద్ధంగా శ్రీరామ యజ్ఞం జరిపారు. ఆలయంలోని శ్రీదేవతామూర్తులను తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని పోలి ఉండేలా ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వేడుకలో ఆలయ కమిటీ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, ఆలయ ధర్మకర్త రాచకొండ రామచందర్‌రావు, నాగమాధవరావు, నరేష్, వెంకటరమణారావు, రాంమోహన్, కృపాకర్, సుధాకర్, కొణతం చిన వెంకట్‌రెడ్డి, ప్రకాశ్, రామారావు, పూర్ణచంద్రారెడ్డి, లచ్చిరెడ్డి, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, కిశోర్, సుబ్బారావు, భరత్, పవన్, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ముగిసిన శ్రీరామ యజ్ఞ మహోత్సవం


