పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం
సూర్యాపేటటౌన్ : శాంతిభద్రతల పరిరక్షణలో, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి సమాజాన్ని రక్షించేందుకు పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీసు అమరవీరులకు కలెక్టర్‌తో పాటు ఎస్పీ నరసింహ, ఇతర పోలీసు అధికారులు, అమరుల కుటుంబ సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసు సిబ్బంది, అధికారులు స్మృతి పరేడ్ నిర్వహించారు. 2015 ఏప్రిల్ ఒకటో తేదీన సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ఉగ్రవాదుల దాడిలో అమరులైన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్వర్ కుటుంబాలకు 200 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి ఆ పట్టాలను కుటుంబ సభ్యులకు అందించారు. అమరులైన హెడ్ కానిస్టేబుల్ బడే సాహెబ్, కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్వర్ పిలల్లకు చదువుల కోసం జిల్లా కలెక్టర్ నిధుల నుంచి ఆర్థిక సాయం అందించారు. సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన 191 మంది పోలీసు జవాన్లను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పోలీసుల బాధ్యత మరింతగా పెరిగిందని, అందుకు అనుగుణంగా పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నిరంతరం విధినిర్వహణ చేయడం వల్లే ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండగలుగుతున్నారని పేర్కొన్నారు.స్మృతి పరేడ్ కమాండర్‌గా ఆర్‌ఎస్‌ఐ అశోక్ వ్యవహరించగా, అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి 191 మంది పోలీస్ అమరుల పేర్లను స్మరించారు. పోలీసు కళాబృందం సాంస్కృతిక కార్యక్రమాలతో నివాళులర్పించిది. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నర్సింహాచారి, రవి, ఏఓ మంజూ భార్గవి, సీఐలు శివశంకర్, రాజశేఖర్, నాగేశ్వరరావు, నరసింహారావు, వెంకటయ్య, రామకృష్ణారెడ్డి, ప్రతాప్, పోలీసు సంఘం అధ్యక్షుడు రామచందర్‌గౌడ్, ఆర్‌ఎస్‌ఐలు ఎం.అశోక్, కె.అశోక్, సురేశ్, సాయిరాం, రాజశేఖర్, పోలీసు అమరుల కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ శాంతిభద్రతల పరిరక్షణలో మన పోలీసులే నంబర్‌వన్
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
ఫ సూర్యాపేటలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం
ఫ అమరులకు శ్రద్ధాంజలి ఘటించిన కలెక్టర్, ఎస్పీ


