
చికిత్స పొందుతూ మృతి
మునగాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. మునగాల ఎస్‌ఐ బి. ప్రవీణ్‌కుమారు తెలిపిన వివరాల ప్రకా రం.. మునగాల మండలం కోదండరామాపురం గ్రామానికి చెందిన రెణబోతు అప్పిరెడ్డి(75), రెణబోతు లక్ష్మీనరసింహారెడ్డి బుధవారం కోదాడ మండలం కందిబండ గణపవరంలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా.. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీనరసింహారెడ్డికి స్వల్ప గాయాలు కాగా.. అప్పిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పిరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు అచ్చిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన కారును సూర్యాపేట పట్టణంలో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.