
యాసంగిలో వేరుశనగ సాగు అనుకూలం
పెద్దవూర: వేరుశనగ సాగుకు యాసంగి అనుకూలమైదని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్‌కుమార్ పేర్కొన్నారు. నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి ఆహార నూనెల జాతీయ యంత్రాంగం పథకంలో భాగంగా ప్రభుత్వం రైతులకు నూరు శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను కొన్ని మండలాల్లో పంపిణీ చేసింది. ఈ పంటను వానాకాలం సీజన్‌లో ఏ పంట విత్తని పొలాల్లో, స్వల్పకాలిక పంటలను సాగు చేసిన పొలాల్లోనూ సాగు చేసుకోవచ్చు.
● శనగను ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరి దశలో బెట్టకు గురై అధిక ఉష్ణోగ్రత వలన గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గుతుంది.
● వేరుశనగ సాగు చేయడానికి ముందు 70 రోజుల కాలపరిమితి ఉన్న తృణధాన్యాలైన స్వల్పకాలిక కొర్ర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
● వేరుశనగను బంక నేలల నుంచి నల్లరేగడి వరకు ఏ భూమిలోనైనా పండించవచ్చు. చౌడు నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు దీని సాగుకు పనికిరావు.
విత్తే విధానం
సాధారణంగా వేరుశనగ పంటను వర్షాధార పంటగా సాగు చేస్తుంటారు. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు భూమికి ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవచ్చు. విత్తేటప్పుడు విత్తనాన్ని ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల లోతున తడి మట్టి తగిలేలా జాగ్రత్త తీసుకోవాలి.
● ఒక చ.మీ.కు 33 మొక్కలు ఉండేలా చూసుకోవాలి. నీటి వసతి ఉన్నప్పుడు లావు గింజలు కాబూలీ రకం ఎంచుకున్నప్పుడు వరుసల మ ధ్య 45 నుంచి 60 సెం.మీ. దూరం పాటించాలి.
● ట్రాక్టర్ ద్వారా వేరుశనగ విత్తు పరికరాన్ని వాడి పొలంలో మొక్కల మధ్య తగినంత సాంద్రత ఉండేలా చూసుకోవాలి. ఈ పరికరం ద్వారా విత్తనాన్ని, ఎరువును ఒకేసారి వేసుకోవచ్చు.
విత్తనశుద్ధి
విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడిని, మూడు గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్‌తో విత్తనశుద్ధి చేయడం వలన విత్తనం ద్వారా, నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను చాలా వరకు అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 1.5 గ్రాముల టెబ్యుకినజోల్ లేదా 1.5 గ్రాముల ఎటావాక్స్ పవర్‌ను కూడా విత్తనశుద్ధికి వాడవచ్చు. వేరుశనగను మొదటిసారి పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ పొడిని విత్తనానికి పట్టించాలి.
ఎరువుల యాజమాన్యం
నేల స్వభావం, నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి ఎరువులను వాడాలి. హెక్టారు శనగ సాగుకు 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం అందించే ఎరువులను వేయాలి. నేలలో భాస్వరం నిల్వలు సరిపడా ఉన్నప్పుడు భాస్వరం ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. అనిన ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ లేదా 50 కిలోల డీఏపీని వేస్తే పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరం అందుతాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూపంలో వేస్తే పంటకు కావాల్సిన గంధకం కూడా అందుతుంది. విత్తనాన్ని విత్తిన 24 గంటల్లోగా ఫ్లూక్లోరాలిన్ ఎకరాకు 1 లీటర్, లేదా పెండిమిథాలిన్‌ను 1.2 లీటర్ల చొప్పున పిచికారీ చేస్తే కలుపును పంట తొలి దశలో సమర్ధవంతంగా నివారించవచ్చు. పైరు విత్తిన 30 రోజల వరకు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.
కోత సమయం
ఆకులు పచ్చబారడం, రాలిపోవడం, కాయలు పసుపుగా మారి మొక్కలు ఎండిపోయి గింజ గట్టిగా మారినప్పుడు కోత కోయాలి. పంట కోసిన వెంటనే గింజలను ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ, చేతితో గాని నూర్పిడి చేసుకోవచ్చు. రైతులు ఈ విధానాన్ని పాటిస్తే మంచి దిగుబడితో పాటు నాణ్యమైన పంటను పొందవచ్చు.
తెగుళ్లు, సస్యరక్షణ చర్యలు..
వేరుశనగ పంటలో ఎండు తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా కాడలతో పాటు ముడుచుకుపోయి చనిపోతాయి. వేరు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. ఎండు తెగులును నివారించేందుకు వేసవిలో లోతుగా దుక్కి దున్నడం వల్ల ముందు పంట అవశేషాలు తీసేయడంతో తెగులు తీవ్రతను తగ్గించవచ్చు.
వేరుశనగ పంటలో కుళ్లు తెగులు ద్వారా కాండం మొదలులో ఒక నొక్కు ఏర్పడి మొక్క చనిపోతుంది. తెగులు సోకిన తొలిదశలో తెల్లని శిలీంధ్రం బీజాలు ఆవ గింజల మాదిరి కాండం మీద కనిపిస్తాయి. నేలలో ఎక్కువ తేమ ఉండటం, అంతగా కుళ్లని సేంద్రీయ పదార్థం ఉండటం, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ తెగులు ఉధృతికి తోడ్పడతాయి. విత్తిన పది నుంచి పదిహేను రోజుల తర్వాత పొలంలో మొదలు కుళ్లు గమనించినప్పుడు ఎకరాకు 200 గ్రాముల కార్భండిజమ్, 600 గ్రాముల మాంకోజెబ్‌ను వాడి మొక్కల మొదలు బాగం తడిచే విధంగా పిచికారీ చేయాలి.
వేరుశనగ పండించే అన్ని ప్రాంతాల్లో శనగపచ్చ పురుగు ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. పురుగును తట్టుకునే రకాలు అందుబాటులో లేవు. పురుగు మందుల వాడకంతో వాటిని అరికట్టవచ్చు. పురుగు సంతతిపై నిఘా ఉంచడానికి పొలంలో ఒక మీటరు ఎత్తులో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతిని బట్టి నివారణ చర్యలు చేపట్టాలి.
వేరుశనగ పంటలో పచ్చ రబ్బరు పురుగు నివారణకు ముందుగానే పంట వేసిన 15 రోజులకు ఒక లీటరు నీటిలో 5 మిల్లీలీటర్లు వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువైతే లీటరు నీటికి 200 మిల్లీలీటర్ల ఇండాక్సాకార్భ్ కలిపి పిచికారీ చేయాలి.

యాసంగిలో వేరుశనగ సాగు అనుకూలం