అప్పులు తీర్చేందుకు చైన్‌ స్నాచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చేందుకు చైన్‌ స్నాచింగ్‌

Oct 17 2025 6:44 AM | Updated on Oct 17 2025 6:44 AM

అప్పులు తీర్చేందుకు చైన్‌ స్నాచింగ్‌

అప్పులు తీర్చేందుకు చైన్‌ స్నాచింగ్‌

శాలిగౌరారం: అప్పులు తీర్చేందుకు గాను మహిళపై దాడి చేసి ఆమె మెడలోని పుస్తెలతాడు అపహరించిన దొంగను పోలీసులు 24 గంటలు గడువక ముందే అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నకిరేకల్‌లోని శాలిగౌరారం సర్కిల్‌ కార్యాలయంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన నాగుల శ్రీనివాస్‌ వృత్తిరీత్యా చేనేత కార్మికుడు. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని పద్మానగర్‌లో నివాసముంటున్నాడు. శ్రీనివాస్‌ గతంలో తన ఇద్దరు కుమార్తెల వివాహాలు చేసేందుకు గాను అప్పులు చేశాడు. దీనికి తోడు కరోనా సమయంలో అతడి భార్య అనారోగ్యానికి గురికావడంతో మరింత అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో పాటు వాటికి వడ్డీలు పెరిగిపోతుండటంతో అర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఎలాగైనా అప్పులు తీర్చాలని శ్రీనివాస్‌ భావించాడు. ప్రస్తుతం బంగారం ధరలు విరీతంగా పెరగడంతో బంగారం దొంగతనం చేసినట్‌లైతే అప్పులు తొందరగా తీర్చవచ్చని అనుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం నకిరేకల్‌ మండలం ఓగోడు గ్రామానికి చెందిన ఆవుల సావిత్రమ్మ శాలిగౌరారం మండలం మాధారంకలాన్‌ శివారులో ఉన్న తన వ్యవసాయ భూమి వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా.. శ్రీనివాస్‌ స్కూటీపై అటుగా వెళ్తూ.. సావిత్రమ్మను చూసి స్కూటీ ఆపాడు. ఎక్కడకు వెళ్తున్నావ్‌ అని ఆమెను అడగగా.. ఆమె మాధారంకలాన్‌ వెళ్తున్నానని చెప్పింది. తాను అటువైపే వెళ్తున్నానని చెప్పి ఆమెను శ్రీనివాస్‌ తన స్కూటీపై ఎక్కించుకున్నాడు. మాధారంకలాన్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని చౌళ్లగూడెం వద్ద గల 365వ నంబర్‌ జాతీయ రహదారి జంక్షన్‌ సమీపంలోకి రాగానే టాయిలెట్‌ వస్తుందని స్కూటీని ఆపాడు. స్కూటీ దిగిన సావిత్రమ్మ రోడ్డు వెంట నడుచుకుంటూ చౌళ్లగూడెం జంక్షన్‌ వైపు వస్తుండగా.. వెనుక నుంచి స్కూటీపై వచ్చిన శ్రీనివాస్‌ ఇనుపరాడ్డుతో సావిత్రమ్మ తలపై విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. శ్రీనివాస్‌ వెంటనే సావిత్రమ్మ మెడలోని నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని స్కూటీపై పారిపోయాడు. దొంగిలించిన బంగారు పుస్తెలతాడును నల్లగొండ పట్టణంలోని మణప్పురం ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టి రూ.3.11 లక్షలు రుణం తీసుకున్నాడు. అందులో నుంచి రూ.61వేలు సొంత అవసరాలకు వాడుకొని.. మిగిలిన రూ.2.50 లక్షలు ఇంట్లో పెట్టుకున్నాడు. బాధితురాలి కుమారుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆదేశాల మేరకు శాలిగౌరారం, నకిరేకల్‌ సీఐల నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడు శ్రీనివాస్‌ను గురువారం అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అతడి నుంచి ద్విచక్ర వాహనం, రూ.2.50 లక్షల నగదు, ఇనుపరాడ్డు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చిబ జడ్జి ఆదేశానుసారం రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. డీఎస్పీ శివరాంరెడ్డి, శాలిగౌరారం, నకిరేకల్‌ సీఐలు కొండల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శాలిగౌరారం, నకిరేకల్‌, కేతేపల్లి ఎస్‌ఐలు సైదులు, లచ్చిరెడ్డి, సతీష్‌, పోలీస్‌ సిబ్బంది జానయ్య, లక్ష్మణ్‌, సతీస్‌, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, సురేశ్‌, శ్రీకాంత్‌ను ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అభినందించారు.

మహిళపై దాడిచేసి పుస్తెలతాడు

అపహరించిన దొంగ

24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు

స్కూటీ, రూ.2.50 లక్షల

నగదు స్వాధీనం

వివరాలు వెల్లడించిన

నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement